
ప్రేమజంట పెళ్లి.. వధువుపై కేసు
దొడ్డబళ్లాపురం: యువకున్ని వివాహం చేసుకున్న యువతిపై కేసు నమోదు చేసిన సంఘటన మాగడి తాలూకా కుదూరులో జరిగింది. వివరాలు.. సౌమ్య (19), వసంత్(19) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. సౌమ్య తరఫు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా జూలై 11న ఇద్దరూ మాగడిలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. చట్ట ప్రకారం వధువుకి 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండాలి.అయితే ఇక్కడ పెళ్లికొడుకు వయసు 19 ఏళ్లే కావడంతో అతని కుటుంబీకులు సౌమ్యపై కుదూరు పోలీస్‌స్టేషన్‌లో బాల్య వివాహం చట్టం కింద ఫిర్యాదుచేయగా కేసు నమోదయింది.
కాలేజీ గొడవలపై సీరియస్
బనశంకరి: కాలేజీల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాలకు ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని యాజమాన్యాలకు సూచించినట్లు బెంగళూరు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. శనివారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ.... ఆవలహళ్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఓనం వేడుకల్లో విద్యార్థులు రోడ్ల మీద పడి దాడులు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించామన్నారు. ఓ నర్సింగ్ కాలేజీలో జూనియర్లు తమకు సమాచారం ఇవ్వకుండా ఓణం చేయడాన్ని సీనియర్ విద్యార్థులు వ్యతిరేకించారు. ఇరువర్గాల బయటకు వచ్చి కొట్టుకున్నారు. సుమారు 40 మంది ఈ రగడలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ గొడవలో 8 మంది కాలేజీ సిబ్బందిని నిర్బంధించామన్నారు. ఇకపై కాలేజీల్లో ఏర్పాటుచేసే కార్యక్రమాలు గురించి ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
కొత్త హెలికాప్టర్‌ను కొన్న మంత్రి
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లాకు చెందిన మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త సతీష్ జార్కిహొళి కొత్త హెలికాప్టర్‌ను కొన్నట్లు తెలిసింది. సొంతంగా పర్యటనల కోసం కొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరగా ప్రయాణాలకు హెలికాప్టర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అగస్టా కంపెనీ హెలికాప్టర్‌ను బెంగళూరు జక్కూరు ఏరోడ్రోమ్‌లో బిగిస్తున్నారు, దీనిని జర్మనీ నుంచి తెప్పించారు, ఆ పనులను ఆయన పరిశీలించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త చాపర్ ఎగరడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతతో కూడినది, డబుల్ ఇంజిన్‌లు ఉంటాయి. ఇద్దరు పైలట్‌లు ఇందులో ఉంటారు అని తెలిపారు. దీని విలువ రూ.20కోట్లు గా తెలిసింది.
కోర్టు ఆవరణలో భార్యకు కత్తిపోట్లు
దొడ్డబళ్లాపురం: కోర్టు ఆవరణలోనే ఓ కసాయి భర్త, భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన దావణగెరెలో జరిగింది. పట్టణ నివాసులపైన ప్రవీణ్,పవిత్ర దంపతుల మధ్య విబేధాలు రావడంతో పవిత్ర విడాకుల కోసం కోర్టుకెక్కింది. శనివారంనాడు కేసు ఉండడంతో ఇద్దరూ దావణగెరె ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. పవిత్ర ను చూడగానే ప్రవీణ్ కత్తితో ఆమైపె దాడి చేశాడు. పలుచోట్ల కత్తి గాయాలయ్యాయి. తరువాత తానూ కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్త గాయాలతో ఉన్న ఇద్దరినీ పోలీసులు దావణగెరె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ప్రేమజంట పెళ్లి.. వధువుపై కేసు