
మహిళలకు సైబర్ నేరగాళ్ల వల
హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ జంట నగరాలపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. తరచూ అమాయకులను పల్టీ కొట్టించి లక్షల రూపాయలను దండుకుంటున్నారు. అదే మాదిరిగా ఆన్‌లైన్‌లో షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు తీసుకోవచ్చునని ఇద్దరు మహిళల నుంచి రూ.88.83 లక్షలను దోచేశారు.
భాగ్యశ్రీకి రూ.62 లక్షలు..
వివరాలు.. భాగ్యశ్రీ అనే మహిళకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపించారు. సరేనని ఆమె సంప్రదించింది. ది రాయల్ మిట్ ఇన్వెస్ట్‌మెంట్ పేరున టెలిగ్రాం గ్రూప్‌లో ఆమెను చేర్చారు. తమకు పెద్దమొత్తంలో లాభాలు వచ్చాయంటూ గ్రూప్‌లో చాలామంది మెసేజ్‌లు పెట్టేవారు. దీంతో భాగ్యశ్రీ కూడా మోసగాళ్ల సూచన మేరకు ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి రూ.62.03 లక్షలను వారికి పంపించింది. అయితే రోజులు గడుస్తున్నా ఎలాంటి లాభం రాలేదు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఆమె నంబర్‌ను బ్లాక్ చేశారు. దీంతో బాధితురాలు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బ్యాంకు ఉద్యోగినికి..
మరో ఘటనలోనూ షేర్ల ట్రేడింగ్ పేరున బ్యాంక్ మహిళా ఉద్యోగికి రూ.26.80 లక్షలు వంచించారు. స్థానికురాలు మారియా.. ఫేస్‌బుక్ చూస్తుండగా ట్రేడింగ్ చేసి ఎక్కువ డబ్బులు గడించవచ్చునన్న లింక్‌పై క్లిక్ చేశారు. దీంతో ఆమె మొబైల్ ఫోన్ నంబర్ క్షణాల్లోనే వంచకుల గ్రూప్‌లో చేరిపోయింది. ఆమెకు నకిలీ ట్రేడింగ్ యాప్‌ను పంపించింది, రూ. 26 లక్షలకు పైగా డబ్బులు బదలాయించుకున్నారు. చివరకు ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరికి రూ.88 లక్షలు బురిడీ
హుబ్లీ– ధార్వాడలో ఆన్‌లైన్ మోసాలు