బనశంకరి: బెంగళూరు నగరవ్యాప్తంగా రౌడీల ఇళ్లు, బార్– రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం తెల్లవారుజామువరకు రౌడీల అడ్డాలపై తనిఖీలు సాగించారు. రాజధానిలో నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశగా1500 మంది రౌడీల ఇళ్లకు వెళ్లి వారు ఆ సమయంలో ఉన్నారా , లేదా అని చూడడంతో పాటు ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా మారణాయుధాలు, మత్తు పదార్థాలు వంటిని కనిపించడంతో మొత్తం 134 కేసులు నమోదు చేశారు.
ఎక్కడెక్కడ ఎంతమంది..
ఈశాన్య విభాగంలో నగర పోలీసులు 169 మంది రౌడీల ఇళ్లకు వెళ్లారు. ఉత్తర విభాగంలో 179, తూర్పు లో 247, పశ్చిమలో 222 , ఎలక్ట్రానిక్ సిటీలో 100 , ఆగ్నేయ లో 120, కేంద్ర లో 20, వాయువ్యలో 102, వైట్‌ఫీల్డ్‌లో 140 మంది రౌడీల ఇళ్లు, స్థావరాల మీద దాడులు నిర్వహించారు. ఆకస్మాత్తుగా పోలీసులు రావడంతో రౌడీలకు కునుకు కరువైంది. ఇళ్లలో లేనివారితో ఫోన్‌లో మాట్లాడారు. ఎక్కడికి, ఎందుకు వెళ్లారు అని విచారించి హెచ్చరించారు. రౌడీషీటర్లు చేస్తున్న వృత్తి, ఆదాయ వివరాలను సేకరించారు. నేరాల్లో పాల్గొనరాదని హెచ్చరించారు. తరచూ రౌడీల ఇళ్లలో సోదాలు చేస్తామని తెలిపారు.
రాత్రివేళ ఇళ్లలో పోలీసుల
ఆకస్మిక సోదాలు
1,500 మంది నేరగాళ్లకు హెచ్చరికలు
రౌడీలకు కునుకు కరువు