
జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి
హొసపేటె: జనాభా గణన సర్వేకు ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. శనివారం స్థానిక రోటరీ క్లబ్‌లో కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ 2025 సామాజిక విద్య, ఆర్థిక జనాభా గణన సర్వే చర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వే సమీక్ష ఈ నెల 22 నుంచి వచ్చే నెల 7 వరకు జరుగుతుందని తెలిపారు. జనాభా గణన సర్వేను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ, కేపీసీసీ ఉపాధ్యక్షుడు ఎంసీ వేణుగోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, వివిధ సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
జంట హత్యల కేసులో
నిందితుడికి ఖైదు
హొసపేటె: జిల్లాలోని కూడ్లిగి తాలూకా దొడ్డగొల్లరహట్టికి చెందిన మహాలింగ అనే వ్యక్తికి జంట హత్యల కేసులో జీవిత ఖైదు, రూ.40 వేల జరిమానా జిల్లా సెషన్స్ కోర్టు విధించింది. కేసు పూర్వాపరాలు.. 2019 నవంబర్ 4న గజాపుర సమీపంలోని చిరబి అటవీ ప్రాంతంలో తన భార్య సుజాత, మంజునాథ్‌ల మధ్య అనైతిక సంబంధం ఉందని అనుమానించిన మహాలింగ వారిద్దరినీ రాయితో కొట్టి చంపాడు. నిందితుడు దోషిగా తేలిన తర్వాత హొసపేటెలోని మూడవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీపీ కుమారస్వామి జీవిత ఖైదుతో పాటు జరిమానాను కూడా విధించారు. రూ.40,000 మంజునాథ్, సుజాత వారసులకు పరిహారంగా అందించాలని ఆదేశించారు. కూడ్లిగి పోలీసు స్టేషన్ సిబ్బంది సాక్షులను సకాలంలో హాజరుపరిచి, సహకరించారని, ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన టీ.అంబన్న సమర్థంగా కేసు వాదించారని తెలిపారు.
మందుల వాడకంపై జాగృతి ర్యాలీ
బళ్లారి రూరల్: ఫార్మకోవిజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా శనివారం బీఎంసీఆర్‌సీ ఔషధశాస్త్ర(ఫార్మకాలజీ) విభాగం మందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వెంటనే వైద్యులకు తెలిపాలని జాగృతి ర్యాలీని నిర్వహించారు. ఫార్మకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ వై.విశ్వనాథ్ మాట్లాడుతూ మందులు వాడినప్పుడు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వైద్యులు రోగులకు తెలియజేయాలి. గడువు ముగిసిన, నకిలీ మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫార్మకాలజీ విభాగం నుంచి క్యాజువాలిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఎంసీఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ చిదంబరమూర్తి, ఫార్మకాలజీ విభాగ వైద్యులు డాక్టర్ మురుగేశ్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ శకుంతల, వైద్య, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
నియామకం
రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ రాయచూరు జిల్లా ప్రచార సమితి ప్రధాన కార్యదర్శిగా బూడిదపాడు శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ కేపీసీసీ ప్రచార సమితి అధ్యక్షుడు వినయ్ కుమార్ సొరకె శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సిఫార్సు మేరకు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వం అమలు చేసిన పంచ గ్యారెంటీ పథకాల గురించి వివరించాలన్నారు.
రోటోవేటర్ తగిలి రైతు మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామం వద్ద పొలంలో పనుల్లో నిమగ్నమైన ట్రాక్టర్ రోటోవేటర్ నుంచి గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. శివప్ప నవలూరు (47) మృతుడు. సదరు యంత్రానికి కుడి కాలు చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హుబ్లీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా మరో ఘటనలో రూ.4.87 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. నగరంలోని సుల్తాన్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అంగడిలో ఓ మహిళ బుర్కా ధరించి వచ్చి రూ.4.87 లక్షల విలువ చేసే ఆభరణాలను చోరీ చేసిన ఘటనపై హుబ్లీ టౌన్ పోలీసులు కేసు దాఖలు చేసుకున్నారు. బంగారు గాజులు కొనే నెపంతో అంగడికి వచ్చిన ఆ కిలాడి మహిళ అంగడి గుమాస్తా దృష్టిని మళ్లించి 40.47 గ్రాముల బంగారు గాజులు చోరీ చేసి పరారైనట్లు ఆ అంగడి మేనేజర్ లియాకత్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యా రంగానికి పెద్దపీట
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచూరు తాలూకా మన్సలాపుర పంచాయితీని సందర్శించారు. వ్యవసాయ కూలీ కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కూసిన కనసు పథకాన్ని పరిశీలించారు. పిల్లల హాజరు శాతం మరింత పెంచాలన్నారు. తాలూకాలోని వివిధ తాగునీటి పథకాలను పరిశీలించారు. అక్క కెఫెను కూడా పర్యవేక్షించారు.

జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి

జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి

జనగణన సర్వేకు ప్రజలు సహకరించాలి