
కల్యాణ కర్ణాటకలో కుండపోత
గ్రామంలోకి ప్రవేశించిన నీరు
పొంగి ప్రవహిస్తున్న వాగు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. ఉదయం ఎండలు వేడిని పుట్టించాయి. మహారాష్ట్రలోని మూడు జలాశయాల నుంచి 1.5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి విడుదలతో భీమా నదికి వరద పోటెత్తింది. కలబుర్గి జిల్లా అప్జల్‌పుర తాలూకా దేవల గాణగాపుర– ఘత్తరిగి వంతెనలు నీట మునిగాయి. మణ్ణూరు యల్లమ్మ దేవాలయం, శేషగిరి, మణ్ణూరు, కుడగనూరు, శివూర్, ఉడచణ, బోసగ, దుద్దణిగి, మంగళూరు, హిరియాళలలో పెసర పంట నీటి పాలైంది. చిత్తాపుర తాలూకాలో భీమా నది పొంగి ప్రవహిస్తోంది. గ్రామాలోకి నీరు చొరబడ్డాయి. కలబుర్గి దక్షిణ నియోజకవర్గంలో బిద్దాపూర్ కాలనీలో 40 ఇళ్లు జలావృతమయ్యాయి. బొమ్మనాళ వంతెన కోసుకు పోయింది. రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలో చిత్తాపుర, జాగీర్ నందిహాళ, ఆనెహొసూరు మధ్య వంతెన వరద నీటిలో మునగడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ప్రజలు నీటిలోనే తాడు సహాయంతో దాటుతూ సంచరిస్తున్నారు. కలబుర్గి జిల్లా చించోళిలో ముల్లామారి పథకం కింద నాగరాళ జలాశయం నుంచి నీరు వదలడంతో వరద నీరు పోటెత్తుతోంది. ముదగల్‌లో వాన నీటితో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
జలమయమైన కాలనీలు, ఇళ్లు
ఉప్పొంగిన నదులు, వాగులు

కల్యాణ కర్ణాటకలో కుండపోత