
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
దొడ్డబళ్లాపురం: గదగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సహా ముగ్గురు మృతి చెందారు. ఈఘటన శుక్రవారం గదగ్ తాలూకా హర్లాపుర సమీపంలో 67వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మృతులను అర్జున్(29), వీరేశ్ ఉప్పార(31), రవి నల్లూర(43)గా గుర్తించారు. వీరు ముగ్గురూ కారులో వెళ్తుండగా హర్లాపుర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని తరువాత పక్క రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జయింది. స్థానికులు, పోలీసులు వచ్చి అందులోని వారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. అర్జున్, వీరేశ్‌కి ఇటీవలనే వివాహం నిశ్చయమైంది. వీరేశ్ కొప్పళ జిల్లా పోలీస్ వైర్‌లెస్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా, అర్జున్ హావేరి జిల్లా పోలీస్ వైర్‌లెస్ విభాగంలో పని చేస్తున్నాడు. మూడేళ్లుగా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గదగ్ జిల్లాలో ఘటన
మృతుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు