
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
హుబ్లీ: హావేరిలోని చెన్నబసప్ప మాగావి మైదానం వృద్ధుల చప్పట్లు, కేకలతో నిండిపోయింది. 60 ఏళ్లు నిండిన అవ్వతాతలు యువత సిగ్గుపడేలా క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఇంత వయసులోను కూడా చిన్న పిల్లల వలే జంకుతు ఆడుతూ పాడుతూ ఆ జిల్లా యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన అక్టోబర్ ప్రపంచ వృద్దుల దినోత్సవం నేపథ్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ జిల్లాలోని 8 తాలూకాల నుంచి వివిధ వృద్ధాశ్రమాలు అలాగే రిటైర్డ్ అయిన కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పోటీలు వరుసగా 60, 70, 80, ఏళ్లు ఉన్న అవ్వ తాతలకు ప్రత్యేకంగా నిర్వహించారు. పరుగు, చిన్న పాటి నడక, మ్యూజికల్ చేర్, బకెట్‌లోకి బంతి విసరడం, రింగ్ విసరడం తదితర పోటీలను నిర్వహించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
క్రీడా పోటీల తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలైన ఏకపాత్రాభినయం, గాయనం తదితర పోటీలను జరిపారు.
జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి అశునదాఫ్, ఆ జిల్లా ఉద్యోగుల సంఘం నేత ఎస్‌బీ అణ్ణిగేరితో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. బీపీ షుగర్ తదితర పరీక్షలు జరిపారు. వయసు పైబడితే మరుపు సమస్య వేధించడం మామూలే. అయితే ఈ వృద్దులు వారి శారీరక మానసిక బలహీనతలకు చెక్ పెట్టి క్రీడలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా యువతకు సరికొత్త రీతిలో స్పూర్తితో పాటు చైతన్యం కలిగించారు.
వృద్ధుల క్రీడాపోటీలు అదుర్స్

ఉత్సాహంగా.. ఉల్లాసంగా