
నిప్పులా మద్దూరు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం మీద రాళ్ల దాడి, ఆపై సోమవారం హిందూ సంఘాల నిరసనలు, వారి మీద పోలీసుల లాఠీచార్జీతో అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. మంగళవారం కూడా నిషేధాజ్ఞలను కొనసాగించారు. పట్టణమంతా షాపులు, విద్యాలయాలు మూతపడ్డాయి. జనసంచారం కరువై బంద్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాలలో జనం బిక్కుబిక్కుమంటున్నారు. పరిసర జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటుచేశారు.
నేడు కూడా నిమజ్జనం, భద్రత: ఐజీ
ఈ నేపథ్యంలో స్థానిక ఐజీ బోరలింగయ్య మంగళవారం పరిస్థితిని సమీక్షించారు. నిమజ్జనం సమయంలో కొంతమంది దుండగులు రాళ్ళతో దాడి చేయడంతో, రెండు గుంపులు దాడులు చేసుకున్నాయి. గొడవలు పెరగకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది, సోమవారం మద్దూరు పట్టణంలో బంద్ జరిగింది. బుధవారం ఉదయం వరకు మద్దూరు పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సుమారు వెయ్యిమందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారని తెలిపారు. బుధవారం కూడా వినాయకుల నిమజ్జనం ఉన్నందున భద్రతను మరింత పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 22 మందిని అరెస్టు చేసినట్లు, కొందరు ముఖ్యులు పరారీలో ఉన్నారని ఎస్పీ మల్లికార్జున బాలదండి చెప్పారు. వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. రాళ్ళ దాడిలో సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా మొత్తం 26 మంది నిందితులను గుర్తించామని చెప్పారు.
మంగళవారం మద్దూరు పట్టణంలో బంద్ వాతావరణం
తప్పుచేసినవారిపై చర్యలు: సీఎం సిద్దు
బనశంకరి: మద్దూరులో గణేశ్ నిమజ్జనం సమయంలో గొడవ కేసులో 22 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఎలాంటి కులమత భేదాన్ని ప్రభుత్వం పరిగణిందని, తప్పుచేసిన వారిపై చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. మద్దూరుకు బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టడంపై మండిపడ్డారు. విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాజంలో శాంతికి భంగం కలిగించడమే బీజేపీ పని. మద్దూరులో బంద్ కు పిలుపునిచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్ర హోం శాఖ మంత్రికి బీజేపీ ఫిర్యాదు చేసిందనే దానిపై సిద్దరామయ్య స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం మీద పోరాటంలో అనేకమంది రైతులు చనిపోతే, మణిపూర్‌లో హింస జరిగితే బీజేపీ నేతలు ఎందుకు నోరు ఎత్తడం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు పర్యటించలేదని అన్నారు.
రాష్ట్రంలో అస్తవ్యస్తం
కేంద్ర హోంమంత్రికి బీజేపీ ఫిర్యాదు
శివాజీనగర: కన్నడనాట శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో అమిత్‌షాను కలిసి ఫిర్యాదు అందజేశారు. కోట్లాదిమంది హిందువుల పుణ్యక్షేత్రాల మీద కుట్రలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాని వివరించామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బతికేందుకు సాధ్యపడని పరిస్థితి వచ్చింది, నిత్యం దాడులు జరగుతున్నాయి. మంగళూరు, కొప్పళ సహా అనేకచోట్ల హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు. మతతత్వ శక్తుల అట్టహాసం అధికమైంది. పోలీస్ స్టేషన్‌లపై దాడి జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల చేతులు కట్టిపడేసిందన్నారు. మద్దూరులో దాడులను ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీలతో దాడులు చేశారన్నారు. మైనారిటీల పేరుతో తప్పిదస్తుల మీద ఉదాసీనంగా ఉంటున్నారన్నారు. శాంతిభద్రతల స్థాపనకు చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరినట్లు చెప్పారు.