
దర్శన్‌కు ఉపశమనం
శివాజీనగర: రేణుకాస్వామి హత్య కేసులో నిందితులు నటుడు దర్శన్, ఇతర నలుగురు ముద్దాయిలు సమర్పించిన పిటిషన్లను బెంగళూరు 64వ సెషన్స్ కోర్టు విచారించి వారికి ఊరటనిచ్చేలా ఆదేశాలిచ్చింది. వారిని పరప్పన అగ్రహార జైలు నుంచి ఇతర జిల్లాల్లోని చెరసాలకు తరలించాలనే జైలు అధికారుల పిటిషన్‌ను జడ్జి ఐపీ నాయక్ డిస్మిస్ చేశారు. దర్శన్ సెలబ్రిటీ, ఇక్కడే ఉంటే సమస్య అవుతుందని అధికారులు తెలిపారు. బళ్లారితో సహా ఏ జిల్లా జైలుకు తరలించరాదని, ఇక్కడే ఉంటే విచారణకు సులభమవుతుందని దర్శన్ న్యాయవాది పేర్కొన్నారు. కాగా, జైల్లో కనీస సదుపాయాలను కల్పించాలనే దర్శన్ వినతి మేరకు, నిబంధనలను బట్టి వసతులను కల్పించాలని కూడా జడ్జి ఆదేశించారు.
చెరసాలలో కష్టకర జీవితం
● రేణుకాస్వామి హత్య కేసులో నటీనటులు పవిత్ర, దర్శన్ రెండవసారి అరెస్టు కావడం తెలిసిందే. వీరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ప్రత్యేక సదుపాయాలను కల్పించరాదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జైలు అధికారులు కఠినంగా ఉన్నట్లు సమాచారం.
● సినీ స్టార్‌గా విలాసవంతమైన జీవితం గడిపే దర్శన్, ప్రస్తుతం జైలులో సాధారణ ఖైదీలతో పాటుగా ఉంటున్నారు
●జైలులో పెట్టే ఆహారం సహించడం లేదు. బరువు కూడా తగ్గినట్లు తెలిసింది.
● సరైన నిద్ర లభించక మనశ్శాంతి కరువైందని సమాచారం. ఎవరినీ కలవనివ్వకపోవడంతో ఒంటరితనం ఆవరించింది
● బ్యారక్‌ల ఎక్కువసేపు ఒంటరిగా గడపుతున్నారు. సిబ్బంది ఆయనను బయటకు కూడా పంపడం లేదని తెలిసింది.
● వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు కలుస్తున్నారు.
జైలు బదిలీ అర్జీ కొట్టివేత
సౌకర్యాల కల్పనకు ఆదేశం