
పరప్పన జైలుకు ఎమ్మెల్యే పప్పి
హుబ్లీ: కోట్లాది రూపాయల అక్రమ బెట్టింగ్‌ల నిర్వహణ కేసులో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి ని ఈడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ రిమాండు ముగియడంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఆయనను హాజరు పరిచారు. కోర్టు జుడిషియల్ రిమాండు విధించడంతో పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు.
హైకోర్టులో భార్య పిటిషన్
ఇక బెట్టింగ్ కేసులో భర్తని అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకమంటూ వీరేంద్ర భార్య ఆర్‌డీ.చైత్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ గురించి 2022 జూలై 6న హారోహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అందులో ఎవరి పేరును పేర్కొనలేదు. ఈ కేసు ఆధారంగా ఈడీ ఆగస్టు 23న తన భర్తను తొలి నిందితునిగా పేర్కొంటూ అరెస్టు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ అరెస్ట్ దురుద్దేశంతో కూడిందని అన్నారు. దీంతో సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీచేసింది.
నేటి నుంచి మైసూరు దసరా క్రీడా పోటీలు
మైసూరు: 2025–26వ సంవత్సరంలో మైసూరు జిల్లా స్థాయి దసరా క్రీడా కూటమి బుధ, గురువారాల్లో మైసూరు చాముండి విహార క్రీడాంగణంలో జరుగనుంది. మైసూరు జిల్లాలోని 9 తాలూకాల్లో జరిగిన తాలూకా స్థాయి దసరా క్రీడా కూటమి వ్యక్తిగత పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాలు, గ్రూప్ పోటీల్లో ప్రథమ స్థానం పొందినవారు మైసూరు జిల్లా స్థాయి దసరా క్రీడా పోటీలకు ఎంపికవుతారు. పురుషుల అథ్లెటిక్స్‌లో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 5 వేలు, 10 వేల మీటర్ల పరుగు పందెం, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, 110 మీటర్ల హర్డిల్స్, 400 మీటర్ల రిలే, 4000 మీటర్ల రిలే ఉంటాయన్నారు. వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్, కుస్తీ, బాడ్మింటన్, హాకీ, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయన్నారు.