
సిటీ బస్సుల్లో రణరంగమే
సాక్షి, బెంగళూరు: రాజధాని బెంగళూరులోని బీఎంటీసీ బస్సులు నగరం నలుమూలలా సంచరిస్తూ ప్రజలను గమ్యం చేరుస్తుంటాయి. ఆ బస్సులే లేకపోతే ఎంతటి ఇబ్బందులు వస్తాయో చెప్పలేము. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు డ్రైవర్లు, కండక్లర్లతో ప్రయాణికుల వాగ్వాదాలు, కొన్నిసార్లు కొట్టుకోవడాలు పరిపాటిగా మారాయి. బీఎంటీసీ బస్సుల్లో గొడవలు పెరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీఎంటీసీ డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తన బాగా లేదంటూ ప్రయాణికులు, ఇతర వాహనదారులు బీఎంటీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా వస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటివరకు 10వేలకు పైగా ఫిర్యాదులు బీఎంటీసీకి అందాయి. అయితే ఆ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన బీఎంటీసీ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సగం ఫిర్యాదులు వారి మీదే
● గడిచిన 8 నెలల కాలంలో 10,609 ఫిర్యాదులు బీఎంటీసీకి అందాయి. ఇందులో 4,093 ఫిర్యాదులు కేవలం డ్రైవర్లు, కండక్టర్ల అనుచిత ప్రవర్తనలపైనే నమోదవ్వడం విశేషం. ఈ ఏడాది ముగిసే నాటికి ఈ ఫిర్యాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.
● గతేడాది ప్రయాణికుల నుంచి 11,412 ఫిర్యాదులు అందాయి. అందులో 5,494 ఫిర్యాదులు డ్రైవర్లు, కండక్టర్ల అతి పైనే వచ్చాయి.
● ఇప్పటికే బీఎంటీసీ బస్సు ప్రమాదాల వల్ల తరచూ ప్రాణనష్టం జరుగుతోంది. అనుచిత ప్రవర్తన ద్వారా మరింత అప్రతిష్ట వస్తోందనే ఆరోపణలున్నాయి.
● ఉచిత బస్సు వసతి తరువాత రద్దీ అధికమైంది. పని ఒత్తిడి లేదా మరే కారణమో తెలియదు చిన్న చిన్న విషయాలకే ప్రయాణికులపై కోపపడుతూ, ఒక్కోసారి దాడులకు కూడా తెగబడుతున్నారు.
తరచూ గొడవలకు దిగుతున్న
డ్రైవర్లు, కండక్టర్లు
ప్రయాణికుల బెంబేలు
బీఎంటీసీ సిబ్బందిపై ఫిర్యాదుల వెల్లువ
ఇప్పటికే 10 వేల దాఖలు
కొన్ని ఉదాహరణలు
దేవనహళ్లి నుంచి మెజిస్టిక్‌కు బీఎంటీసీ బస్సు వెళుతోంది..ఒక స్థానికేతర ప్రయాణికుడు బస్సు ఎక్కి టికెట్ ఇవ్వాలని కండక్టర్‌ను కోరాడు. అయితే కండక్టర్ వినిపించుకోలేదు. ఇంతలో తనిఖీ సిబ్బంది వచ్చి ప్రయాణికునికి జరిమానా విధించారు. ఈ కారణంగా కండక్టర్‌ను అతడు ప్రశ్నించడం, గొడవ జరిగి చెంప దెబ్బ కొట్టే వరకూ వెళ్లింది.
మెజిస్టిక్ నుంచి జయనగరకు బీఎంటీసీ బస్సు వెళుతోంది. లాల్‌బాగ్ బస్టాప్‌లో ఎక్కిన విద్యార్థిని ఒకరు ఆధార్‌కార్డు చూపించి తాను వెళ్లే స్టాప్ పేరు చెప్పి టికెట్ ఇవ్వాలని కండక్టర్‌ను కోరింది. అయితే కండక్టర్ ఎందుకో ఆ యువతిని అసభ్యంగా దూషించారు. ఇది సరికాదని తోటి ప్రయాణికులు హెచ్చరిస్తున్నా వారి మీద కూడా కేకలేశాడు.
మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులతో సైతం రగడలు జరుగుతుంటాయి.

సిటీ బస్సుల్లో రణరంగమే

సిటీ బస్సుల్లో రణరంగమే