
యుద్ధభూమిగా మద్దూరు
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవంలో తీవ్ర రభస చెలరేగింది. కొందరు నిమజ్జనం మీద రాళ్లు విసరడంతో గొడవలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేశారు. మంగళవారం ఉదయం వరకు నిషేధాజ్ఞలను ప్రకటించడంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది.
ఏం జరిగిందంటే..
వివరాలు.. మద్దూరు పట్టణంలోని సిద్దార్థ నగరలోని 5వ క్రాస్‌లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. ఊరేగింపు సాగుతుండగా రామ్‌రహీమ్ నగరలో కొందరు అల్లరిమూకలు ఇళ్ల పై నుంచి రాళ్లు విసరసాగారు. దీంతో పోలీసులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ దాడిలో నలుగురు హోంగార్డులతో పాటు మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన యువకులు, హిందూ సంఘాల నాయకులు కాషాయ జెండాలు పట్టుకుని సోమవారం ఉదయం 10 గంటలకు నాలా సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎస్పీ మల్లికార్జున బాలదండి, పోలీసులు భారీగా చేరుకున్నారు. షాపులను మూసివేయించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ రాత్రయితే చాలు కత్తులు, రాడ్లు పట్టుకుని తిరుగుతున్నారు, మరో పాకిస్తాన్ చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి జనాలను చెదరగొట్టారు. ఎవరూ బయటకు రావద్దని నిషేధాజ్ఞలను విధించారు. దీంతో సోమవారం అంతా బంద్ అయ్యింది. దాడి కేసులో 21 మందిని అరెస్టు చేశాం, పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ తెలిపారు.
గణేశ నిమజ్జనంపై రాళ్ల దాడి
నిరసనగా ఆందోళన
పోలీసుల లాఠీచార్జీ

యుద్ధభూమిగా మద్దూరు