
అలల్లో ఆపసోపాలు
● 5మంది విద్యార్థుల రక్షణ
యశవంతపుర: ప్రమాదకరమైన చోట సముద్రంలో ఈతకు వెళ్లిన విద్యార్థులు అలల్లో కొట్టుకుపోసాగారు. ఇంతలో స్థానిక జాలర్లు వారిని సాహసం చేసి రక్షించారు. ఈ సంఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా గోపాడి చక్రికాడు వద్ద అరేబియా సముద్ర తీరంలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన 10 మంది కాలేజీ విద్యార్థులు శనివారం సాయంత్రం ఉడుపిలోని కుంబాశికి వెళ్లి ఓ లాడ్జిలో దిగారు. రాత్రి సముద్ర తీరం తిరగసాగారు. అలా తిరగరాదని పోలీసులు హెచ్చరించి లాడ్జికి పంపారు. ఆదివారం ఉదయం 7:30 గంటలకు గోపాడి చక్రికాడు వద్ద సముద్రపు నీటిలోకి వెళ్లారు, మధ్యాహ్నం వరకూ ఈత కొడుతూ ఉన్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొందరు మునిగిపోతున్నామని కేకలు వేయసాగారు, జాలర్లు ఈశ్వర్ మలై, మహేశ్, మరికొందరు పరుగులు తీసి ఇద్దరిని, మరోసారి ముగ్గురిని రక్షించారు. అందరూ క్షేమంగా బయటపడడంతో హమ్మయ్య అనుకున్నారు. విద్యార్థులను బెంగళూరుకు పంపించారు.
క్రెడిట్ పెంపు అని
రూ.21 లక్షల టోపీ
మైసూరు: తన క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచాలని వచ్చిన సందేశాన్ని నమ్మి ఒక వృద్దుడు రూ. 21 లక్షలను పోగొట్టుకొన్నాడు. మైసూరులోని యాదవగిరి వివేకానంద రోడ్డుకు చెందిన గౌస్ (76) బాధితుడు. రెండు రోజుల క్రితం గౌస్ మొబైల్‌ఫోన్‌కు మీ క్రెడిట్‌కార్డు పరిమితిని పెంచుతున్నట్లు ఒక ఎస్‌ఎంఎస్ వచ్చింది. గౌస్ దానిని నమ్మి తన ఈమెయిల్, క్రెడిట్ కార్డు నంబర్ పుట్టిన తేది, వివరాలను అందించాడు. కొంతసేపటికి కార్డును ఉపయోగించి రూ. 1.48 లక్షలు ఖర్చు చేసినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఈ విషయం బ్యాంకుకు తెలియజేసి కార్డును బ్లాక్ చేశాడు. కానీ దొంగలు అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 20 లక్షలు కూడా డ్రా చేశారు. కంగుతిన్న గౌస్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
సజావుగా నిమజ్జనం
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో, సొరబ పట్టణంలోను గణేశమూర్తి నిమజ్జనం వేడుకలు మత సామరస్యంతో సాగాయి. సోమవారం శివమొగ్గలో నిమజ్జనోత్సవం జరిగింది. హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొన్నారు. తుంగా నగర నుంచి నిమజ్జనం వెళ్తుండగా టిప్పు నగర చానల్ వద్ద వద్ద ముస్లింలు కలిసి స్వాగతం పలికారు. భక్తులకు మజ్జిగ, పానకం అందజేశారు. సొరబ పట్టణంలో ఈద్ ఊరేగింపులో హిందువులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పురసభ వద్దకు చేరుకున్న సమయంలో పానకం అందజేసి సౌహార్దతను చాటుకున్నారు.

అలల్లో ఆపసోపాలు