
చల్లని తల్లీ.. ఆరోగ్యమాత
యశవంతపుర: బెంగళూరు శివాజీనగరలోని సెయింట్ మేరీ బెసిలికా చర్చిలో ఆరోగ్యమాత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 29న ఉత్సవాలు ప్రారంభం కావడం తెలిసిందే. ఆ రోజు నుంచి సోమవారం వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. బాధల్లో ఉన్నవారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని, కష్టాలను కడగండ్లను కడతేర్చాలని భక్తులు, రోగులు, దీనులు ఆరోగ్యమాతను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దేశంలో ప్రజలందరూ శాంతి, సుఖం, నెమ్మదితో జీవనం సాగించాలని ప్రార్థనలు చేసినట్లు శివాజీనగర చర్చి ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ ఆరోక్య స్వామి సెబాస్టియన్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వేల సంఖ్యలో క్రైస్తవులు విశేష పూజలు, ప్రార్థన, జాగరణ విధి విధానాలను నిర్వహించారు. అన్ని మతాల వారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. సాయంత్రం నుంచి రాత్రి వరకూ అమ్మవారి విగ్రహాన్ని తేరులో ఉంచి చర్చి పరిసరాలలో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు.
కరావళి తీరంలో ఉత్సవాలు
ఉడుపి, మంగళూరు నగరాల్లోనూ వివిధ చర్చల్లో మేరీ మాత ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉడుపిలో ఫాదర్ జెరాల్డ్ లోబో పవిత్ర బలి పూజలు చేశారు. మంగళూరులో క్రైస్తవులు మేరీ మాత ఉత్సవాలలో భాగంగా మోంతి పండుగను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఊరేగింపుగా చర్చిలకు తరలివచ్చారు.
సెయింట్ బసిలికాలో రథోత్సవం
తరలివచ్చిన భక్త సాగరం

చల్లని తల్లీ.. ఆరోగ్యమాత