
చిన్నకాకర.. ఆరోగ్యానికి ఆసరా
సాక్షి,బళ్లారి: సాధారణంగా ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ప్రారంభమైనప్పుడు జూన్, జూలై రెండు నెలలు మాత్రమే మార్కెట్‌లో కనిపించే కర్చికాయలు(చిన్నకాకర కాయలు) సెప్టెంబర్ నెల వచ్చినా ఇంకా మార్కెట్‌లో ప్రతి నిత్యం కనిపిస్తున్నాయి. రైతులు పొలాల్లో పండించే కూరగాయల కంటే వాటంతటవే కొండ గుట్టలు, బీడు భూములు, నల్లరేగడి భూముల్లో తీగలా అల్లుకుని పండుతాయి. రుచికరమైన ఈ కర్చికాయలు ఈసారి నాలుగు నెలలుగా ప్రజలకు అందుబాటులోకి రావడం విశేషం. వర్షాలు నిరంతరాయంగా పడుతుండటం కూడా ఈ కాయలు కాయడానికి దోహదం చేస్తున్నాయని రైతులు, కర్చికాయల విక్రేత మహిళలు చెబుతున్నారు. కర్చికాయల విక్రయం వల్ల మహిళలకు స్వయం ఉపాధి దొరుకుతుండటంతో ప్రజలకు ఆరోగ్యానికి ముఖ్యంగా షుగర్ వ్యాధి నియంత్రణకు దోహదం చేస్తున్నాయి. బీడు భూముల్లో రైతులు విత్తనాలు విత్తకపోయినా వాటంతటవే మొలిచి, పెరిగి తీగలా అల్లుకుని కాసే కర్చికాయలకు రోజురోజుకు భలే డిమాండ్ ఏర్పడుతోంది.
మహిళలకు స్వయం ఉపాధి
వర్షాలు బాగా కురుస్తుండటంతో కర్చికాయల వల్ల మహిళా కూలీలకు మంచి ఉపాధి దొరుకుతోంది. బళ్లారి జిల్లాలో సిరుగుప్ప, బళ్లారి తాలూకా కంప్లి ప్రాంతాల్లో విస్తారంగా కర్చికాయలు కాయడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు పొద్దున్నే పొలాల్లోకి వెళ్లి కర్చికాయలను విడిపించుకుని వచ్చి నగరంలో అమ్మకాలు సాగిస్తారు. ముఖ్యంగా గంపల్లో పెట్టుకుని అక్కడక్కడ రోడ్ల పక్కన, కూడళ్ల వద్ద అమ్ముతుంటారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 కేజీల వరకు కర్చికాయలు విడిపించుకుని వచ్చి ఇలా అమ్మకాలు చేస్తుంటారు. ఒక్కో కేజీ కర్చికాయలు సైజ్‌ను బట్టి రూ.150 నుంచి రూ.200లు ధర పలుకుతుండటంతో వ్యవసాయ కూలీలకు, వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తోంది. కొందరు మహిళలు పొలాల వెంట, వర్షాధారిత భూములు, గుట్టల్లోకి వెళ్లి స్వయంగా వారే విడిపించుకుని వచ్చి అమ్మకాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు.
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు
ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే కర్చికాయలను బళ్లారి జిల్లాలో జనం తినడానికి రోజురోజుకు ఇష్టపడుతున్నారు. కాకరకాయల్లో ఏవిధమైన ఔషధ గుణాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉండటంతో పాటు ఎలాంటి మందులు వేయకుండా వాటంతటవే పండే కూరగాయల్లో ఒకటైన కర్చికాయలను ప్రతి ఒక్కరూ ఇష్టంతో ధర ఎంతైనా కొనుగోలు చేస్తున్నారు. షుగర్ వ్యాధికి, అధిక బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. కాకరకాయల వలే కర్చికాయలు కూడా రుచికరంగా ఉండటంతో కొంత చేదుతో కూడి రుచిగా ఉంటాయని, దీంతో చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుందని సూచిస్తున్నారు. నగరంలో ప్రతి రోజు సంగం సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఈ కర్చికాయలను మహిళలు అమ్మకాలు చేస్తుంటారు.
ఆరోగ్యానికి మేలు చేకూర్చే కర్చికాయలు
కొండలు, గుట్టల్లో విరివిగా కాస్తున్న వైనం
కిలో ధర రూ.150 నుంచి రూ.200ల పైనే
ఈ కాయలకు మార్కెట్‌లో భలే డిమాండ్
నిత్యం 80 సేర్ల వరకు అమ్ముతాం
ఈ సందర్భంగా బిసలహళ్లికి చెందిన పద్మావతమ్మ, పార్వతమ్మలు మాట్లాడుతూ తాము ప్రతి నిత్యం కనీసం 80 సేర్ల వరకు కర్చికాయలను అమ్ముతున్నామన్నారు. ఒక కేజీ రూ.200 వరకు అమ్ముతున్నామన్నారు. తామే పొలాల్లోకి వెళ్లి తీసుకుని వచ్చి రోజు అధిక లాభాలు వస్తుంటాయన్నారు. ఇతరుల ద్వారా కొనుగోలు చేసిన రోజు ప్రతి రోజు కనీసం రూ.1000 వరకు లాభం వస్తుందన్నారు. తమకు నాలుగు నెలలుగా ఉపాధి దొరికిందని, నగర ప్రజలకు కూడా మంచి కూరగాయలను(కర్చికాయలను) అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కర్చికాయలను ఏటేటా జనం బాగా తినడానికి ఇష్టపడుతున్నారన్నారు. ఎలాంటి మందులు వేయకుండా సహజసిద్ధంగా పండే కూరగాయ చిన్నకాకర కాయ అని, ఇది వండిన తర్వాత రొట్టెలు లేదా చపాతీల్లోకి తింటే దాని రుచి అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్న వారు వారంలో రెండు రోజులు కొనుగోలు చేసుకుని వెళుతుంటారన్నారు. వర్షాకాలంలో సీజనల్‌గా రెండు నెలల పాటు పొలాల్లో విరగకాసే కర్చికాయలను తినడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.

చిన్నకాకర.. ఆరోగ్యానికి ఆసరా

చిన్నకాకర.. ఆరోగ్యానికి ఆసరా