
పవిత్రగౌడ బెయిలు అర్జీ కొట్టివేత
శివాజీనగర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, నటి పవిత్రాగౌడ బెయిల్ కోరుతూ సమర్పించిన పిటిషన్ కొట్టివేయబడింది. నగర 57వ సెషన్స్ కోర్టులో ఆమె బెయిలు కోసం అర్జీ దాఖలు చేయగా మంగళవారం వాదనలు జరిగాయి. బెయిలు ఇవ్వరాదని పోలీసుల తరఫు న్యాయవాది గట్టిగా వాదించారు. రేణుకాస్వామి మరణంతో తనకు సంబంధం లేదు, ఆమె ఒంటరి మహిళ, కూతురిని చూసుకోవాలి అని పవిత్ర న్యాయవాది పేర్కొన్నారు. ఆలకించిన జడ్జి ఐపీ నాయక్.. బెయిలు అర్జీని కొట్టివేయడంతో పవిత్రగౌడ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవల సుప్రీంకోర్టు వారి బెయిలును రద్దు చేయడంతో దర్శన్, పవిత్రగౌడ సహా ఇతర నిందితులను తిరిగి పరప్పన జైలుకు తరలించడం తెలిసిందే. ఇప్పుడు బెయిలు కోసం హైకోర్టుకు వెళతారా, లేదా అన్నది చూడాలి.
బళ్లారి నుంచి తరచూ ఎలా?
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు దర్శన్‌ను బెంగళూరు పరప్పన జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించడం, అదనపు బెడ్, దిండు ఇవ్వడం పిటిషన్‌ను మంగళవారం విచారించిన సెషన్స్ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. త్వరలో కేసు విచారణ మొదలవుతుందని, అప్పుడు పదే పదే బళ్లారి నుంచి దర్శన్ ను తీసుకురావడం సాధ్యం కాదని ఆయన న్యాయవాది వాదించారు. కేసులో 272 మంది సాక్షులు ఉన్నారని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంవత్సరాల కొద్దీ విచారణ చేయడం ఎలా అవుతుందని అన్నారు. పోలీసుల న్యాయవాది స్పందిస్తూ జైలు అధికారులు నియమాల ప్రకారం సౌకర్యాలను ఇస్తున్నారని, ఒకరికి ప్రత్యేకంగా ఇస్తే మొత్తం 3 వేల మంది ఖైదీలకూ ఆ సౌకర్యాలను ఇవ్వాలని వాదించారు.
ముడుపుల స్కాం..
భోవి చైర్మన్ రాజీనామా
దొడ్డబళ్లాపురం: కమీషన్‌లు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర భోవి అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు రవికుమార్ పదవికి రాజీనామా చేశారు. భూ యజమానుల పథకంలో లబ్ధిదారుల నుంచి 40 శాతం కమీషన్లు తీసుకున్నట్టు ఆయన పై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం సిద్ధరామయ్య సూచనల మేరకు రవికుమార్ రాజీనామా చేసినట్టు తెలిసింది. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని మధ్యవర్తి ఒకరు రవికుమార్‌కు అందజేస్తున్న వైనం రహస్య కెమెరాలో ఎవరో చిత్రీకరించి వైరల్ చేశారు. అందులో రవికుమార్ మాట్లాడుతూ ఈ డబ్బులు తనకు ఒక్కడికే కాదని, మంత్రి వరకూ పంపకాలు చేయాలని చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వానికి ఇబ్బందికి మారింది. దీంతో తప్పనిసరిగా రవికుమార్ చేత రాజీనామా ఇప్పించడం జరిగింది.
హెబ్బాళలో స్పెషాలిటీ ఆస్పత్రి
దొడ్డబళ్లాపురం: హెబ్బాళలోని వెటర్నరీ, ఫిషరీస్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో హైటెక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భైరతి సురేశ్ తెలిపారు. మంగళవారంనాడు సంబంధిత అధికారులతో కలిసి ఆయన స్థల పరిశీలన చేశారు. చాలా సంవత్సరాలుగా హెబ్బాళ నియోజకవర్గంలో హైటెక్ మల్టీ సెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనే డిమాండు ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్ద ప్రస్తావించగా సమ్మతించి నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేశారన్నారు.