
రోడ్ల మరమ్మతు కోసం వినూత్న నిరసన
రాయచూరు రూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన వానలకు అధ్వాన స్థితికి చేరుకున్న రహదారుల మరమ్మతు చేపట్టాలంటూ మొక్కలు నాటి నిరసన ప్రదర్శన చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అఖిల భారత క్రాంతికారి విద్యార్థి సంఘం, యువజన వేదికల జిల్లాధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్ మాట్లాడారు. నగరంలో నడవడానికి వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయని, మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మారెప్ప, ప్రకాష్, అబ్బాస్, రవిచంద్రన్, హుచ్చరెడ్డి, నిరంజన్‌లున్నారు.
స్వచ్ఛ మంత్రాలయకు శ్రీకారం
రాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం స్వచ్ఛతకు శ్రీకారం చుట్టారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ ఈ కార్యక్రమానికి శుభం పలికారు. మంత్రాలయ మఠంలో భక్త సమూహంతో మూడు ప్రాంతాల్లో స్వచ్ఛ, సుందర, స్వర్ణహరిత మంత్రాలయంగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దాలని స్వామీజీ సూచించారు. మహదేవపుర మాజీ శాసన సభ్యుడు అరవింద లింబావళి వెయ్యి మంది వాలంటీర్లతో శ్రమదానం చేయించారు.
జెస్కాం ఇంజినీర్
అనుమానాస్పద మృతి
రాయచూరు రూరల్: రాయచూరు జెస్కాం విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న గాయత్రి(34) అనుమానాస్పదంగా మరణించారు. మంగళవారం తెల్లవారు జామున ఇంటిలో కింద పడి మరణించినట్లు భర్త బసవరాజ్ తెలిపారు. ఈ విషయంపై పశ్చిమ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందడంతో ఎస్‌ఐ మంజునాథ్ మృతదేహాన్ని పంచనామా కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయత్రి మృతదేహాన్ని భర్త బసవరాజ్ బళ్లారికి తరలించి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతుండగా అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయత్రి, భర్త బసవరాజ్ పరస్పరం ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు సమాచారం. కాగా గాయత్రి చెల్లెలు వచ్చిన తర్వాత మృతదేహాన్ని బళ్లారికి తీసుకెళ్లారు.
భక్తులకు ప్రసాదం పంపిణీ
రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతుల వద్ద మంగళవారం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కిల్లే మఠం వద్ద తొమ్మిది రోజుల పాటు జరిగిన పూజల్లో భాగంగా కిల్లే మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, సభ్యుడు దరూర్ బసవరాజ్, పురుషోత్తం ఇన్నాణి, శివమూర్తి, భీమన్న, కాశీ విశ్వనాథ్, శాలం, వెంకటేష్, శరణమ్మ, శివ కుమార్, రవి, సంతోష్, కేసరి గజానన కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపారు. అజాద్‌నగర్, మడ్డిపేట, బెస్తవారపేటలో అన్నదానం చేశారు.
విద్యార్థులకు క్రీడలూ అవసరం
హొసపేటె: విద్యార్థులకు పాఠ్యేతర కార్యకలాపాలు అవసరం ని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్ తెలిపారు. మంగళవారం జి.నాగలాపుర గ్రామంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శారీరక శ్రమ ఉంటే శరీరంలో తేజస్సు ఉంటుంది. శరీరం శక్తివంతంగా ఉండటానికి శారీరక కార్యకలాపాలు ముఖ్యం. శరీరం ఎల్లవేళలా చురుగ్గా ఉండాలంటే జీవశక్తి ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. క్రీడలను ఉత్సాహంగా ఆడాలని ఆయన పిలుపుపిచ్చారు. నియోజకవర్గంలోని 201 పాఠశాలలకు క్రీడా పరికరాలు, 81 పాఠశాలలకు విజ్ఞాన ప్రయోగశాల పరికరాలు పంపిణ చేశామన్నారు. రెండున్నరేళ్లలో విద్యా రంగానికి రూ.81 కోట్ల గ్రాంట్ ఇచ్చామన్నారు. పిల్లలు తల్లిదండ్రుల కోరిక మేరకు బాగా చదువుకోవాలన్నారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించాలని ఆయన పిల్లలకు సూచించారు. ఈ సందర్భంగా నాగలాపుర గురు ఒప్పత్తేశ్వర మఠానికి చెందిన జీ.నిరంజన్ ప్రభు మహాస్వామి, బీఎంఎం ఇస్పాత్ అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్ల మరమ్మతు కోసం వినూత్న నిరసన

రోడ్ల మరమ్మతు కోసం వినూత్న నిరసన