
ఎస్సీ వర్గీకరణ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ గత 30 ఏళ్లుగా ఆందోళనలు చేపడుతున్నామని గుర్తు చేశారు. వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్‌కు జిస్టిస్ నాగమోహన్‌దాస్ అందించిన నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సర్కార్ అంగీకరించాలన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు లేని అడ్డంకి కర్ణాటకకు ఎందుకని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్‌లే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సును చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో హేమరాజ్, ఆంజనేయ, శ్రీనివాస్, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు.