
ఎరువుల సరఫరాలో సర్కారు విఫలం
బళ్లారి టౌన్: రాష్ట్రంలో రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ పేర్కొన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆ పార్టీ కార్యాలయం నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీని నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం తాయణ్ణ తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ఈసారి ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సక్రమంగా కురిశాయన్నారు. రైతులు వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించారన్నారు. అయితే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సరైన సమయంలో అందించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 6.8 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, కేంద్రం నుంచి ఎరువులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సర్కారు వైఫల్యాలపై రాష్ట్ర గవర్నర్ తగిన మార్గదర్శనం చేసి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నేతలు లక్ష్మికాంత్‌రెడ్డి, అశోక్, ప్రభాకర్‌రెడ్డి, కిరణ్, జావేద్, ప్రదీప్, దివాకర్, మహిళా నేతలు పుష్ప, రేష్మ, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సక్రమంగా ఎరువుల పంపిణీకి డిమాండ్
రాయచూరు రూరల్: రైతులకు సక్రమంగా ఎరువులు పంపిణీ చేయాలని గురుమఠకల్ శాసన సభ్యుడు శరణే గౌడ కందకూరు డిమాండ్ చేశారు. సోమవారం జేడీఎస్ ఆధ్వర్యంలో యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. రైతులకు డీఏపీ, ఎరువులు, క్రిమి సంహారక మందులు పంపిణీ చేయకుండా దొంగతనంగా నల్ల బజారులో విక్రయిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలిగించారన్నారు. రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఎరువుల సరఫరాలో సర్కారు విఫలం