
బళ్లారి రాఘవ కీర్తి.. దశదిశలా వ్యాప్తి
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లాకు ఎప్పటి నుంచో దేశ, విదేశాల్లో గుర్తింపు ఉందంటే అందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి. ప్రముఖంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హంపీ ద్వారా బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. అయితే చాలా సంవత్సరాల నుంచి హంపీతో పాటు బళ్లారి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అందుకు బళ్లారి జిల్లాలో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేపథ్యం, ఇనుప ఖనిజ నిల్వలు తదితరాలతో బళ్లారి ఖ్యాతి దశ, దిశలా వ్యాపించిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగస్టు 2వ తేదీన జన్మించిన బసప్ప అనే వ్యక్తి తర్వాత బళ్లారిలో స్థిరపడి బళ్లారి రాఘవగా తన పేరును రూపాంతరం చేసుకుని బళ్లారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అలాంటి గొప్ప వ్యక్తి 145వ జయంతి వేడుకలు శనివారం బళ్లారిలోని రాఘవ కళామందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఆయన చరిత్రను ఒకసారి తిలకిస్తే..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 1880లో కన్నడాంధ్ర ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ జన్మించారు. పుట్టింది తాడిపత్రిలో అయితే పెరిగింది, పేరు ప్రఖ్యాతులు గడించింది బళ్లారిలోనే. విద్యార్థి దశ నుంచి నాటక రంగంపై ఆసక్తి పెంచుకుని బళ్లారి రాఘవ దేశ, విదేశాల్లో వివిధ పాత్రల్లో తన నటనాశైలితో ప్రపంచంలోనే వివిధ దేశాల్లో గుర్తింపు తెచ్చుకుని బళ్లారికి పేరు తెచ్చిన మహానటుడిగా నిలిచారు. నాట్యకళాప్రపూర్ణగా, విశ్వవిఖ్యాత నటుడుగా, నాటక రంగం ద్వారానే తన అపూర్వ ప్రతిభను కనబరిచి నాటకాలకే వన్నే తెచ్చారు బళ్లారి రాఘవ. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలన్నింటిలోనూ నటించిన ఘనత బళ్లారి రాఘవ స్వంతం. హరిశ్చంద్రుడు, హిరణ్య కశిపుడు, బాహుకుడు, యమధర్మరాజు, దుర్యోధనుడు, దశరథుడు, భరతుడు, రావణుడు, కీచకుడు, అర్జునుడు, చాణుక్యుడు, రాజరాజు, రామదాసు తదితర పాత్రలలో నాటకాల్లో తన అపార ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు రాఘవ.
అపార ప్రతిభతో పాత్రలకు వన్నె
ఆయన కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో అపారమైన ప్రతిభతో నాటకాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. భక్త ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడు పాత్ర పోషించి, సాక్షాత్తూ హిరణ్యకశిపుడే వచ్చారనే విధంగా ఆయన నటించేవారు. బళ్లారి రాఘవ వృత్తి రీత్యా లాయర్. ఆయన న్యాయవాద వత్తితో పాటు చిన్నప్పటి నుంచి పుణికి పుచ్చుకున్న నాటక రంగం ద్వారానే అపారమైన పేరు గడించారు. ఆయనకు పేరుతో పాటు ఆయన పుట్టి, పెరిగిన అటు తాడిపత్రికి, ఇటు బళ్లారికి పేరు వచ్చిందంటే అందులో బళ్లారి రాఘవ నటనా వైభవం కూడా దాగి ఉంది. బళ్లారి రాఘవ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నాట్య కళాప్రపూర్ణగా బిరుదాంకితుడైన బళ్లారి రాఘవ రంగస్థల నటుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
నేడు బళ్లారి రాఘవ 145వ జయంతి
బళ్లారి రాఘవ 145వ జయంతి సందర్భంగా రాఘవ కళా మందిరంలో ఈ నెల 2న బళ్లారి రాఘవ రాజ్య ప్రశస్తికి కన్నడ కళాకారుడు బెంగళూరుకు చెందిన డింగ్రి నాగరాజ్ ఎంపికయ్యారు. ధార్వాడకు చెందిన కళా సంఘం సంస్థ ఆధ్వర్యంలో వీరేష్ బళగాలపేట్ రచించిన సమరసింహ సంగొళ్లి రాయణ్ణ అనే కన్నడ ఐతిహాసిక నాటకాన్ని ప్రభు హంచనాళ్ దర్శకత్వంలో ప్రదర్శించనున్నారు. ఈ నెల 3న తెలుగు రాష్ట్ర ప్రశస్తి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన గుమ్మడి గోపాలకృష్ణ ఎంపికయ్యారు. శ్రీ రామన్ ఫౌండేషన్, శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ బృందంచే విజయవాడ సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్ పీవీఎస్.కృష్ణ రచించిన జయహో చత్రఫతి శివాజీ మహారాజ్ అనే చారిత్రక తెలుగు నాటకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

బళ్లారి రాఘవ కీర్తి.. దశదిశలా వ్యాప్తి

బళ్లారి రాఘవ కీర్తి.. దశదిశలా వ్యాప్తి

బళ్లారి రాఘవ కీర్తి.. దశదిశలా వ్యాప్తి