
యువత దురలవాట్లకు గురి కారాదు
రాయచూరు రూరల్ : యువత దురలవాట్లకు బానిస కారాదని తహసీల్దార్ సురేష్‌వర్మ పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మహంత స్వామి జన్మదినం సందర్భంగా ఇలకల్ మహంత శివయోగి చేపట్టిన మద్యపాన వ్యసనం నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం గురించి వివరించారు. యువత సన్మార్గం వైపు నడవాలని, మన భారతీయ సంస్కృతి, ఆచార, విచారాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. వార్త శాఖాధికారి గవిసిద్దప్ప, డాక్టర్ మనోహర్ పత్తార్, బాబూరావ్ శేగుణశి, ప్రకాష్‌లున్నారు.
దేవదుర్గలో టోల్‌గేట్లు తొలగించండి
రాయచూరు రూరల్ : జిల్లాలోని లింగసూగూరు తాలూకా తింథిణి వంతెన నుంచి దేవదుర్గ తాలూకా కాకరగల్ మధ్య ఏర్పాటు చేసిన రెండు టోల్‌గేట్లను తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం బెంగళూరు వికాససౌధలో ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. కేషిప్ ఆధ్వర్యంలో రూ.46 కోట్లతో రహదారి పనులు నాసిరకంగా చేపట్టారన్నారు. వ్యవసాయ కూలీ కార్మికులు అధికంగా పనులకు వెళ్లే వారి నుంచి టోల్ వసూలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినా మంత్రి అంగీకరించలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టారు. సమావేశంలో శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్‌లున్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై రైల్వే క్లర్క్ సస్పెండ్
● ఫోన్‌లో మాట్లాడుతూ రైలు టిక్కెట్ ఇవ్వడానికి సతాయించిన వైనం
హుబ్లీ: ప్రభుత్వ విధి దైవ విధి అనే నానుడి ఉంది. ప్రభుత్వ పని దొరకడం అంత సులభం కాదు. అయినా ఇక్కడ ఓ రైల్వే క్లర్క్ ఫోన్‌లో బాతాఖానీ కొడుతూ ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వడానికి సతాయించాడు. సదరు వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఉద్యోగి తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. యాదగిరి రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ ఇష్యూయింగ్ క్లర్క్‌గా పని చేస్తున్న వ్యక్తి విధి నిర్వహణ వేళ ఫోన్‌లో మాట్లాడుతూ టిక్కెట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ప్రయాణికులను వేధించాడు. ఎంతో పొడవు ఉన్న క్యూలైన్‌లో నిలబడిన ప్రయాణికులకు టిక్కెట్ ఇవ్వకుండా ఫోన్‌లో మాట్లాడటంలో మునిగి పోయాడు. ఓ ప్రయాణికుడు ఈ విషయమై గొడవకు దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
నేడు కళస ఎగ్జిబిషన్ ప్రారంభం
సాక్షి బళ్లారి: నగరంలోని రాయల్‌ఫోర్ట్ హోటల్‌లో కళస ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు శ్వేషాన్ తెలిపారు. ఈనెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు రాయల్‌ఫోర్టు హోటల్‌లో కళస ఫైన్ జ్యూవెలరీలో బంగారం, డైమండ్, జాడో ఎగ్జిబిషన్‌లో అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ఇక్కడ ఎలాంటి తరుగు, మేకింగ్ చార్జీలు లేకుండా ఇతర బంగారం షాపుల్లో దొరికిన ధర కన్నా తక్కువ ధరకే నాణ్యమైన, నమ్మకమైన బంగారం అమ్మకాలు జరుగుతాయని, నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టంగా చూస్తారని, వారి ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కళస ఫైన్ జ్యూవెలరీ నిర్వహిస్తున్నామన్నారు. నగర వాసులు బంగారం కొనే ఆసక్తి గలవారు ఎగ్జిబిషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

యువత దురలవాట్లకు గురి కారాదు

యువత దురలవాట్లకు గురి కారాదు

యువత దురలవాట్లకు గురి కారాదు