
ఎస్సీ వర్గీకరణ కోసం బృహత్ నిరసనలు
బళ్లారిటౌన్: ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ కల్పించాలని మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నగరంలో దళిత సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాయల్ సర్కిల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వినతిపత్రాన్ని సమర్పించారు. నేతలు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ వర్గాలకు వర్గీకరణ, రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఆదేశాలు చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలైనా కర్ణాటకలో మాత్రం కాలయాపన జరుగుతోందన్నారు. తమ కోటా రిజర్వేషన్లు ఇతర వర్గాల పాలవుతున్నాయని, ముఖ్యంగా మాదిగ సంక్షేమం కోసమే నాడు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే ఇందులో 101 ఇతర వర్గాలు చేరడంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. సమాఖ్య నేతలు రాజేష్, దానప్ప, కెంచప్ప, మారెణ్ణ, మునిస్వామి, హనుమంతప్ప, కృష్ణ, నారాయణ స్వామి, కొండయ్య, హులుగప్ప, దేవ, మధు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
అంతర్గత రిజర్వేషన్ల కోసం ర్యాలీ
హొసపేటె: ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఇచ్చిన పిలుపు నేపథ్యంతో శుక్రవారం మాదిగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. సమాజ నేత వీరస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గాల్లో అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఆగస్టు 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాధికారుల కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడాది అయినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన విధానాన్ని అనుసరిస్తోందన్నారు. రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోక పోతే కర్ణాటక బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో అంతర్గత రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అయితే కర్ణాటకలో అనవసర జాప్యం జరుగుతోందన్నారు. అంతర్గత రిజర్వేషన్లను సత్వరం అమలు చేయకుంటే పోరాటం అనివార్యమని ఆయన అన్నారు. సమాజ నేతలు భరత్‌కుమార్, ఉమాపతి పాల్గొన్నారు.
మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంచాలకుడు రవీంద్ర జాలదార్ ఆరోపించారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్‌లో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌ను వర్గీకరణకు పలువురు నేతలు అడ్డు పడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిందన్నారు. నాగమోహన్ దాస్ నివేదికలో లోపాలను సవరించాలన్నారు. అది ద్రావిడ, కర్ణాటక పేరుతో ఉన్న ఉపకులాలపై సమీక్ష జరపాలన్నారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు ఏ పార్టీ నాయకులు మద్దతివ్వడం లేదన్నారు. దళితుల ఓట్ల కోసం వర్గీకరణపై ద్వంద్వ వైఖరిని వీడాలన్నారు. రాజు, యల్లప్ప, తిమ్మప్ప, శంశాలం, సతీష్, విరుపాక్షి, భీమయ్య, అంజినేయ్య, నాగరాజ్, రవికుమార్‌లున్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం బృహత్ నిరసనలు

ఎస్సీ వర్గీకరణ కోసం బృహత్ నిరసనలు