
5న ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
హొసపేటె: ఆర్టీసీ ఉద్యోగుల వివిధ డిమాండ్లను తీర్చాలని ఒత్తిడి చేస్తూ హొసపేటె డివిజన్‌లోని ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈనెల 5న నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ జీ.శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని పత్రికా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ల ఆర్థిక బలాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలను సవరించే వ్యవస్థ అమలులో ఉందన్నారు. కానీ ప్రభుత్వం 2024 నుంచి జీతాలను సవరించలేదు. అంతేకాకుండా 38 నెలల బకాయి డబ్బులను నిలిపేసింది. ఆర్టీసీ ఉద్యోగులు వీధుల్లోకి దిగి పోరాడాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ఒత్తిడి లేదా బెదిరింపులకు మేం తలొగ్గం. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు మేం ఎట్టి పరిస్థితుల్లోను సమ్మెను విరమించబోమని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ వాహన డ్రైవర్లు సహా వివిధ సంస్థలు సమ్మెకు మద్దతు ఇచ్చాయి. ఆ రోజు ఆర్టీసీ ఉద్యోగులు తమ విధులకు గైర్హాజరవుతారు. ఆ రోజు ఆర్టీసీ బస్సులేవీ రోడ్డుపై తిరగవు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు వీకే.హిరేమట్, పీ.రాజశేఖర్, నిర్మల్‌కుమార్, అబ్దుల్ రెహమాన్ సాబ్, మహిద్ బాషా, హోలి బసప్ప, యూ.సోమశేఖర్, శేఖరప్ప గులాటి తదితరులు పాల్గొన్నారు.