
ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ
రాయచూరు రూరల్: గత కొన్ని రోజులుగా పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలోని నదీ పరివాహక ప్రాంతంలో అధికంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదీ తీరంలోని విజయపుర, బాగల్‌కోటె జిల్లాల్లోని ఉప నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి డ్యాంలో 518.30 మీటర్ల మేర నీరు నిల్వ చేరాయి. 2 లక్ష క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, 1.60 లక్షల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో రూపంలో బయటకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిప్పాణి తాలూకా బోజ, కున్నూర వద్ద గల వేదగంగా నదిపై కడకోళ వద్ద నిర్మించిన వంతెన, లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనతో పాటు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో సుమారు 50 వంతెనలు నీట మునిగాయి. యాదగిరి జిల్లాలో భీమా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భీమా నది ప్రవాహంతో కడగోలు ఆంజనేయ ఆలయం వరద నీటిలో మునిగి పోయింది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్‌కోటె, విజయపుర, యాదగిరి, రాయచూరు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ