
సకాల సేవల్లో విజయనగర జిల్లా ప్రథమం
హొసపేటె: జూలై– 2025లో సకాలలో పని తీరు పరంగా రాష్ట్రంలోనే విజయనగర జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. ఈ విషయంపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లాధికారి దివాకర్ ప్రశంసించారు. ప్రస్తుతం విజయనగర జిల్లాలో ప్రజలకు సకాలలో సేవలను అందించడానికి ప్రజల నుంచి మొత్తం 85,978 దరఖాస్తులు అందగా, వాటిలో మొత్తం 84,904 దరఖాస్తులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించారు. 98.75 శాతం సకాలలో పరిష్కార రేటును కొనసాగించారు. నిర్ణీత వ్యవధిలో ప్రజా సేవలను పరిష్కరించిన అధికారుల సేవలను జిల్లాధికారి కొనియాడారు. భవిష్యత్తుల్లో కూడా అదే వ్యవధిలో అన్ని ప్రజా సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు.
కరియప్ప సేవలు స్ఫూర్తిదాయకం
హుబ్లీ: శివాజీ అన్న జోళిగె ద్వారా లక్ష్మేదశ్వరలో ప్రతి రోజూ వందలాది మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్న నీలప్ప కుడ్డప్ప శిరహట్టి సేవా సంస్థ నిర్వాహకులు కరియప్ప, సునంద దంపతుల సమాజ సేవ అందరికీ స్ఫూర్తిదాయకం అని హెస్కాం చైర్మన్ అజ్జంపీర్ ఖాద్రి అన్నారు. ఆయన సంబంధిత పోస్టర్‌ను విడుదల చేసి మాట్లాడారు. జంట నగరాలలో ఫుట్‌పాత్ మీద ఉన్న నిరాశ్రయులకు పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతులు ప్రస్తుతం లక్ష్మేదశ్వర కేంద్రంగా సంస్థను ప్రారంభించడం హర్షనీయం అన్నారు. నాగరాజు, హెచ్‌వీ బళెగార, రామన్న, విలేకరులు సోమన్న, గాళప్ప, అల్తాఫ్, కేఈబీ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.