● జిల్లాధికారి గంగాధరస్వామి పిలుపు
బళ్లారి రూరల్ : జిల్లాలో ప్లాస్టిక్ పారదోలి, ప్లాస్టిక్ రహిత నేల, నీరు, పర్యావరణ, పరిసర సంరక్షణ ఆవశ్యకమని దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి తెలిపారు. మంగళవారం తన కార్యాలయ సభాంగణంలో అధికారులకు, రైతులకు పర్యావరణం, పరిసర పరిరక్షణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జూలై 18న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, పీడీఓలకు, గ్రామాధికారులకు, రైతు సంఘాలకు, సంఘ సంస్థలతో వెబినార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిసర పరిరక్షణ మహత్తరమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శబ్ద, వాయు, జల కాలుష్యాలను తగ్గించాలన్నారు. జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ విఠలరావ్, అదనపు జిల్లాధికారి శీలవంత శివకుమార్, రైతు ప్రముఖులు బల్లూరు రవికుమార్, వసంత్, విశ్వనాథ్ పాల్గొన్నారు.