
పనికి తగ్గ వేతనం అందించాలి
సాక్షి,బళ్లారి: నగర స్వచ్ఛతకు పాలికె సిబ్బంది చేస్తున్న కృషి శ్లాఘనీయం అని,అలాంటి వారికి పనికి తగ్గవేతనం అందించాలని మాజీ మంత్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. బళ్లారి మహానగర పాలికె ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా, ఆందోళన కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. సమావేశంలో గంటకు పైగా ధర్నాలో పాల్గొని పాలికె సిబ్బంది సమస్యలు,వాటి పరిష్కారం కోసం సుదీర్ఘంగా చర్చించారు. పాలికె సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంబంధిత మంత్రి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తక్కువ జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న పాలికె పారిశుధ్య కార్మికుల పని తీరు శ్లాఘనీయం అన్నారు. తన వంతుగా పాలికె సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు కాని, అంతకన్నా ఎక్కువగా ఖర్చు, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్లు వెంకట రమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, హనుమంతప్ప, ఆందోళనకారులు పాల్గొన్నారు.
తక్కువ జీతాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
కార్మికులకు మాజీ మంత్రి శ్రీరాములు సంఘీభావం