
ఇరుకు బస్టాండుతో ప్రయాణికుల పాట్లు
రాయచూరురూరల్: దశాబ్దాల క్రితం అప్పటి ప్రయాణికుల రేషియోను బట్టి నిర్మించిన మాన్వి బస్టాండు నేడు ప్రయాణికులు, బస్సుల సంఖ్య పెరిగి ఇరుకుగా మారింది. దీంతో ప్రయాణికుల పాట్లు వర్ణణాతీతం. మాన్విలో 20 ఏళ్ల క్రితం ఎస్‌ఎం కృష్ణ హయాంలో ప్రజాపనుల శాఖ మంత్రి ధరంసింగ్, ఎమ్మెల్యే బోసురాజు నేతృత్వంలో హైదరాబాద్–కర్ణాటక అభివృద్ధి మండలి నిధులతో బస్టాండు నిర్మించారు. కాలక్రమేణా ప్రయాణికుల సంఖ్య పెరిగినా బస్టాండును విస్తరించిన పాపాన పోలేదు. ప్రస్తుతం బస్టాండులో ఐదు బస్సులు నిలబడితే ప్రయాణికులు బస్సుల మధ్య చిన్న చిన్న సందుల మధ్య దూరి పోవాల్సి వస్తోంది. జిల్లాలో రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, హట్టి, సింధనూరు బస్టాండ్‌లు ఎంతో విశాలంగా ఉండగా మాన్వి బస్టాండ్ ఒక్కటే చిన్నదిగా ఉంది. మంత్రాలయం, హైదరాబాద్, రాయచూరు నుంచి మాన్వి బస్టాండ్ మీదుగ హోస్పేట్, గంగావతి, విజయవాడ, కర్నూలు, దావణగెరె, హుబ్లీ, ధార్వాడ, కార్వార, బెంగళూరు, శివమెగ్గ, తుమకూరు, సింధనూరు, కొప్పళ, బళ్లారి వంటి ప్రాంతాలకు బస్‌లు వెళ్తుంటాయి. గ్రామీణ ప్రాంతాలకు వేళ్లే బస్‌లు బస్టాండ్‌లో వచ్చి ఆగుతుంటాయి. బస్టాండులో స్థలాభావంతో బస్సులను ఒకదానిపక్కన ఒకటి ఆనుకొని నిలుపుతున్నారు. ప్రయాణికులు బస్సులోపలకు ఎక్కేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోంది. బస్టాండ్‌ను మరో ప్రాంతంలో విస్తారంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్‌ను విస్తరించాలని 2013లో శా సన సభ్యుడు హంపయ్య నాయక్, 2018లో రాజా వెంకటప్ప నాయక్, 2023లో హంపయ్య నాయక్‌కు విన్నవించినా స్పందన లేదు.
20 ఏళ్ల క్రితం నిర్మాణం
కాలక్రమేణా పెరిగిన ప్రయాణికుల సంఖ్య
బస్సులు నిలిపేందుకు స్థలం లేక ఇబ్బందులు

ఇరుకు బస్టాండుతో ప్రయాణికుల పాట్లు