
కుల దూషణ కేసుకు భయపడి యువకుడు ఆత్మహత్య
● కొడుకు మృతి వార్త తెలిసి గుండెపోటుతో తండ్రి మృతి
● యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో విషాద ఛాయలు
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ఓ యువకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో సదరు యువకుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణ వార్త తెలిసిన వెంటనే తండ్రి గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో జరిగింది. వివరాలు.. తమ పొలానికి వెళ్లడానికి దారి వదలాలని మహబూబ్(19) అనే యువకుడు తన పక్క పొలం వారితో ఏర్పడిన వివాదంలో దళితుడు నింగప్పను కులం పేరుతో దూషించాడని కేసు నమోదైంది. దీంతో యువకుడు మహబూబ్ తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని తండ్రి సయ్యద్ అలీ(50)కి గుండెపోటు రావడంతో అతనిని కలబుర్గిలోని జయదేవ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో వడగేరా పట్టణంలో విఽషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లాధ్యక్షుడు మల్లనగౌడ డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ ప్రతిమపై దాడి..
నిందితుల్ని బంధించరూ
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హరివిలో అంబేడ్కర్ ప్రతిమపై దాడి చేసిన వారిని బంధించాలని అంబేడ్కర్ సేన అధ్యక్షుడు విశ్వనాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం అంబేడ్కర్ ప్రతిమను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించారు.
వేడుకగా దిండి ఉత్సవాలు
రాయచూరు రూరల్ : భావసార క్షత్రియ సమాజంచే గురు పౌర్ణిమ ఉత్సవాల్లో భాగంగా భంగికుంటలో దిండి ఉత్సవాలు, ఆషాఢ మాసోత్సవం జరిగాయి. గురువారం నగరంలోని పాండురంగ విఠల్ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. భంగికుంట నుంచి ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సమాజం అధ్యక్షుడు శ్రీనివాస్ పతంగి, జయంత్ రావ్ పతంగి తదితరులు పాల్గొన్నారు.

కుల దూషణ కేసుకు భయపడి యువకుడు ఆత్మహత్య

కుల దూషణ కేసుకు భయపడి యువకుడు ఆత్మహత్య