
కళ్యాణ వైభోగమే
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ పట్టణంలో దాతలు, సంఘాల సహకారంతో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య భక్తి గీతాల ఆలాపన మధ్య, పండితుల వేద మంత్రోచ్ఛారణలతో వేడుక సాగింది. వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను సుందరంగా అలంకరించి ఉత్సవాన్ని నిర్వహించారు.
నీటి ట్యాంకులో పురుగుల మందు?
● విద్యార్థులకు అస్వస్థత
దొడ్డబళ్లాపురం: కలుషిత నీరు తాగి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హూలికట్టి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠశాలలోని వాటర్ ట్యాంక్ నీటిని తాగిన కాసేపటికే కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. విద్యార్థులు అవస్థలు పడడంతో వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంక్‌లో ఎవరో దుండగులు పురుగుల మందును కలిపినట్టు పోలీసులు, అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే వాటర్ ట్యాంక్ నుంచి గ్రామానికి నీరు సరఫరా అవుతుంది. ఉదయం 6 గంటలకు ఒకసారి నీరు సరఫరా చేస్తే మళ్లీ రెండు రోజులకు వదులుతారు. విద్యా, ఆరోగ్య అధికారులు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కంతు కట్టలేదని ఇల్లు జప్తు
దొడ్డబళ్లాపురం: మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పుల వసూళ్ల కోసం ప్రజలను వేధిస్తే కఠినంగా శిక్షిస్తాం, ప్రత్యేక చట్టం తెచ్చాం అని ప్రభుత్వం చెబుతున్నా వేధింపులు తగ్గడం లేదు. తీసుకున్న రుణానికి వాయిదా కట్టలేదని ఇంటిని సదరు ఫైనాన్స్ సిబ్బంది సీజ్ చేసిన సంఘటన రామనగర తాలూకా తొరెదొడ్డి గ్రామంలో జరిగింది. కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని సీజ్ నోటీసును అంటించారు. గ్రామానికి చెందిన అలివేలమ్మ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఇంటి రుణం తీసుకుంది. అయితే ఆర్థికంగా సమస్యల కారణంగా కంతులు కట్టలేకపోయింది. దీంతో ఇంటిని జప్తు చేస్తున్నట్లు నోటీసులు అతికించారు. బాధితురాలు ఆవేదనకు లోనైంది.
సుపారీ ఇచ్చి నగల
షాపు లూటీ?
దొడ్డబళ్లాపురం: కలబుర్గి పట్టణంలోని నగల షాప్‌లో జొరబడి సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగలను దోచుకున్న ఇద్దరు దొంగలను పోలీసులు ముంబైలో పట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించలేదు. కలబుర్గిలోని సరాఫ్ బజార్‌లో ఉన్న జువెలరీ షాప్‌లో లూటీ చేయాలని దుండగులకు ఒకరు సుపారి ఇచ్చినట్టు సమాచారం. ఆ వ్యాపారితో శత్రుత్వం ఉన్నవారే సుపారి ఇచ్చి ఉంటారని అనుమానాలున్నాయి. ప్రధాన నిందితుడు తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. కొందరు నిందితులు హైదరాబాద్‌కు చెందినవారని తెలిసింది.
విహారయాత్రలో
గుండెపోటుకు బలి
యశవంతపుర: విహారయాత్రకు వెళ్లిన టెక్కీని గుండెపోటు బలితీసుకుంది. వివరాలు.. బెంగళూరు అక్షయ నగరకు చెందిన రాహుల్ (29) ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగి. స్నేహితులతో కలిసి చిక్కమగళూరుకు వెళ్లాడు. హోం స్టేలో బస చేశారు, ఇంతలో ఎద నొప్పి అంటూ కుప్పకూలాడు. మిత్రులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. చిక్కమగళూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇంట్లో మహిళ...
చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా ముత్తిగెపుర గ్రామంలో గోపాల్ భార్య లలిత (50) గుండెనొప్పితో చనిపోయింది. డ్రైవర్ అయిన గోపాల్ ఆదివారం రాత్రి కారుతో బాడుగకు వెళ్లాడు. లలిత ఒక్కరే ఇంటిలో ఉన్నారు. గోపాల్ పని ముగించుకుని వచ్చి చూడగా లలిత వాకిలి వద్ద విగతజీవిగా పడి ఉంది. గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టంలో బయటపడింది.

కళ్యాణ వైభోగమే