
రెండు కార్లు ఢీ, తల్లీ కొడుకు మృతి
మాలూరు: వోక్స్‌వ్యాగన్ పోలో కారు, ఆడి కారు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో వోక్స్‌వ్యాగన్‌లో ప్రయాణిస్తున్న తల్లీ కొడుకులు ఘటనా స్థలంలోనే మరణించారు. ఈ ఘటన మాలూరు దగ్గర బెంగుళూరు – చైన్నె ఎక్స్‌ప్రెస్ రహదారిలోపి టోల్‌గేట్ వద్ద జరిగింది. ఘటనలో ఈశ్వర్ (27), ఆయన తల్లి జనని (46)లు మరణించగా ఆడికారులో ఉన్నవారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఈశ్వర్ ఇంజినీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలిసింది. వారి స్వస్థలం కేజీఎఫ్, ఊరి నుంచి బెంగళూరుకు తిరిగి వెళ్తున్నారు. టోల్‌గేట్ సమీపంలో ముఖాముఖీ ఢీకొన్నాయి. సర్వీస్ రోడ్డులో నుంచి హైవే మీదకు వచ్చిన ఆడి కారు పోలో కారును ఢీకొంది. ఈ భయానక దృశ్యం టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డయింది. పోలో కారు గుర్తుపట్టలేనంతగా నుజ్జయింది. ప్రమాదస్థలిలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
రోడ్డు మరమ్మతులే కారణమా
డబుల్ లేన్‌ను సింగిల్ లేన్ గా చేసి హెచ్చరిక బోర్డులను పెట్టారు. అయితే ఉదయం పొగమంచు వల్ల దారి సరిగా కనిపించక ఢీకొన్నట్లు సమాచారం. మాలూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆడి కారులోని ముగ్గురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
నివారణ చర్యలు ఏవీ?
పోలీసులు మాట్లాడుతూ హైవే మరమ్మతు పనుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అధికారులకు సూచిస్తామన్నారు. స్థానికులు కూడా హైవే అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని కోరారు.
నుజ్జయిన పోలో కారు
మాలూరు వద్ద ప్రమాదం

రెండు కార్లు ఢీ, తల్లీ కొడుకు మృతి