
జై మాతా చాముండేశ్వరి
మైసూరు: ఆషాఢ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధ చాముండికొండ పైన వెలసిన నాడిన శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. సిరులు కురిపించే లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. గత శుక్రవారం సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడిన భక్తులు ఈ వారం సజావుగానే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. పూలతో అమ్మవారి ముఖం, త్రిశూలం, ఓం స్వస్తిక్ చిత్రటాలను రూపొందించారు. తెల్లవారుజామునే దేవాలయం ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో చాముండేశ్వరి దేవికి పంచామృతాలతో అభిషేకం చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలోను వివిధ పూలతో అలంకరించారు.
పలు రాష్ట్రాల నుంచి రాక
రాష్ట్రం నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తారు. భక్తులకు సాధారణ దర్శనంతో పాటు రూ 2 వేల టికెట్, రూ.300 టికెట్ల ద్వారా దర్శనాలు కల్పించారు. మైసూరు నగరంలోని లలిత మహాల్ మైదానం నుంచి భక్తులకు ఉచిత బస్సులను నడిపారు.
ప్రముఖుల పూజలు
డిప్యూటీ సీఎం డీ శివకుమార్, వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి, మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, కొందరు ఎమ్మెల్యేలు, అలాగే ప్రముఖ నటుడు దర్శన్ తదితరులు విశేష పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.
ఆషాఢ శుక్రవారం పోటెత్తిన భక్తులు

జై మాతా చాముండేశ్వరి

జై మాతా చాముండేశ్వరి