
తుంగభద్ర పరవళ్లు
● 20 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల
● లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక జారీ
హొసపేటె: తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం నుంచి అదనపు నీటిని క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం డ్యాం వద్ద 20 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి డ్యాం నుంచి సుమారు 59 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. అధికారికంగా తెరిచిన 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్న అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. తుంగభద్ర నది ఒడ్డున, పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరించారు. నదిలోకి ఎవరూ చేపల వేటకు దిగవద్దని మత్స్యకారులకు సూచించారు. పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తున్నందున డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రస్తుతం నదిలోకి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి డ్యాంకు మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున నదిలోకి మరింత నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా గురువారం డ్యాంలో నీటిమట్టం 1625.55 అడుగులకు, నీటి నిల్వ 78.31 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 34,625 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 59,611 క్యూసెక్కులు ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి నిల్వ కేవలం 8.782 టీఎంసీలు మాత్రమే ఉందేదని మండలి వర్గాలు తెలిపాయి.
స్లో పాయిజన్ ఇచ్చి భర్త హత్య
● వీడియో సాక్ష్యం ఉన్నా భార్యని అరెస్ట్ చేయని పోలీసులు
హుబ్లీ: భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి భార్యను హత్య చేసిన ఘటన యాదగిరి జిల్లా గురుమట్కల్‌లోని గడ్డి మొహల్‌లో జరిగింది. మృతుడిని మహమ్మద్ అలీగా గుర్తించారు. భార్యే స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడాదిన్నర క్రితం భర్తకు దగ్గు ఉందంటూ స్లో పాయిజన్ ఇచ్చి భార్యే భర్తను హత్య చేసింది. అయితే భర్త చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన తమ్ముడు మహమ్మద్ ఇక్బాల్‌కు ఈ వీడియో దృశ్యాలను పంపించారు. తనను సక్రమంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. భోజనం పెట్టేది కాదు, విషం పెట్టినట్లుగా అనుమానం ఉందని మృతుడు చెప్పినట్లుగా వీడియో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై మహమ్మద్ అలీ తల్లి గురుమట్కల్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి పరిశీలించారు. అంతేగాక వీడియో సాక్ష్యం ఉన్నా పోలీసులు మాత్రం బాధ్యురాలైన భార్యను అరెస్ట్ చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని మృతుడి తల్లి జిల్లాధికారికి విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జిల్లా ఇంచార్జి కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వ పరిపాలనాధికారి మమత శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొప్పళ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మోహన్ రాజ్, విజయ నగర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా సమీర్ శుక్లా, బీదర్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రందీప్, బళ్లారి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా త్రిలోక చంద్ర, యాదగిరి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మనోజ్ జైన్, కలబుర్గి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా పంకజ్ కుమార్ పాండే, బాగల్‌కోటె జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మహ్మద్ మోసిన్, విజయపుర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా ఉజ్జవల్ కుమార్ ఘోష్, గదగ్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రమణ దీప్ చౌదరిలు నియమితులయ్యారు.
వచనానంద స్వామి పూర్వాశ్రమ సోదరుడు మృతి
హుబ్లీ: హరిహర పంచమసాలి పీఠం జగద్గురువు వచనానంద స్వామి పూర్వాశ్రమం సోదరుడు అయిన అశోక్ దుండప్ప (45) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెళగావి జిల్లా అథణి తాలూకా తాంవశి గ్రామానికి చెందిన అశోక్ దుండప్ప బుధవారం రాత్రి అథణి నుంచి తాంవశికి వెళుతుండగా ఆయన ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో ఈ ప్రమాదం వా టిల్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందారు. అథణి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఆన్‌లైన్ గేమ్‌తో
రూ.18 లక్షలు హుష్‌కాకి
● యువకుడి ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: నేటి యువత చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఫోన్ ఫీవర్ పట్టుకోవడంతో ఆన్‌లైన్ గేమ్‌లు కూడా కుప్పతెప్పలుగా వస్తున్నాయి. దీంతో ఆ గేమ్‌లు ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దావణగెరె జిల్లాలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి ఏకంగా ఓ యువకుడు రూ.18 లక్షలు కోల్పోయాడు. దావణగెరె నగరంలోని సరస్వతి కాలనీకి చెందిన శశికుమార్(25) అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్ ద్వారా రూ.18 లక్షలు పోగొట్టుకోవడంతో యువకుడు చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌లు బంద్ చేయాలని పాలకులు మాటలకే పరిమితం అవుతున్నారు. ఫోన్‌లో యథేచ్చగా ఆన్‌లైన్ గేమ్‌లు సాగుతుండటంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

తుంగభద్ర పరవళ్లు

తుంగభద్ర పరవళ్లు