
మళ్లీ వరుణ తాండవం
బనశంకరి: మరోసారి కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటక తో పాటు పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. కొడగులో రెడ్ అలర్ట్ ప్రకటించి, 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. పలుచోట్ల బడులు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బెళగావి, ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, శివమొగ్గ, హాసన్, చిక్కమగళూరు జిల్లాల్లో ఉధృతంగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్రలో, పశ్చిమ కనుమల్లో కుండపోత కారణంగా బెళగావి జిల్లాలో సప్త నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. పరిసర గ్రామాల ప్రజలకు ముంపు ముప్పు ఏర్పడింది. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీవ్ర వర్షాలతో బెళగావి జిల్లా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖానాపుర వద్ద హబ్బానట్టి మారుతి ఆలయం జలమయమైంది. ఇక్కడ హలాత్రి కాలువ కూడా వంతెన మీద నుంచి ప్రవహిస్తోంది. 10కి పైగా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. గోవా కు అనుసంధానంగా ఉండే వంతెన కూడా నీటి మునిగింది. దీంతో ధారవాడ నుంచి గోవాకు వెళ్లాల్సి వస్తోంది.
కొడగు సతమతం
కొడగు జిల్లాలో వానలు విజృంభించాయి. విద్యాలయాలకు సెలవుఇచ్చారు. ఒక్క రోజులో సరాసరి 61 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మడికెరి తాలూకాలో 57.18 మిల్లీమీటర్ల వాన పడింది. జలపాతాలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల జలపాతాల వద్ద ప్రజలు, టూరిస్టులు ఉత్సాహంగా గడిపారు. కావేరి నదికి వరద తీవ్రత కొనసాగుతోంది. మండ్య జిల్లాలో కేఆర్‌ఎస్ డ్యాం గేట్లను ఎత్తేశారు.
కరావళి, మలెనాడు, ఉత్తర
కర్ణాటకలో కుంభవృష్టి
పొంగిపొర్లిన నదులు, వాగులు
జనజీవనానికి ఆటంకం
హైవేలో కూలిన కొండచరియలు
యశవంతపుర: హాసన్ జిల్లా సకలేశపుర తాలూకాలో భారీగా వానలు పడుతున్నాయి. జోరుగా కురుస్తున్న వానలతో జాతీయ హైవే– 75లో శిరాడి ఘాట్ మార్గంలో హెగ్గద్ద మారనహళ్లి వద్ద మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో బెంగళూరు– మంగళూరు మధ్య సంచరించే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించారు. బేలూరు మార్గంలో చార్మాడి ఘాట్ మార్గంలో వెళ్లాలని అధికారులు సూచించారు. మంగళూరు నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలను కొడగు జిల్లా సంపాజె మార్గంలో వెళ్లాలని తెలిపారు. ఘటనాస్థలిలో వందల వాహనాలు నిలిచిపోయాయి. అక్కడ చిక్కుకున్న వాహనాల ప్రయాణికులు నరకాన్ని అనుభవిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఆహారం, మంచినీరు లేక అవస్థల్లో ఉన్నారు.

మళ్లీ వరుణ తాండవం

మళ్లీ వరుణ తాండవం

మళ్లీ వరుణ తాండవం