
భూముల రక్షణకు రైతుల దండయాత్ర
దొడ్డబళ్లాపురం: దేవనహళ్లి తాలూకాలోని చెన్నరాయపట్టణ, చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఏరోస్పేస్, టెక్ పార్క్ నిర్మాణం కోసం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారంనాడు వందలాదిమంది రైతులు, దళిత సంఘాల కార్యకర్తలు ముఖ్యమంత్రి నివాసం వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా భూస్వాధీనాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తూ రైతులకు అన్యాయం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. రైతులు మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానన్నారు. 24 గంటల లోపు ప్రభుత్వం భూస్వాధీనం నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు. తమపై పెట్టిన కేసులను రద్దు చేయాలని కోరారు. జులై 4న ముఖ్యమంత్రి రైతులను చర్చలకు పిలిచారని అయితే అప్పటి వరకూ తమ పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేసారు. అభివృద్ధి కోసం ప్రతిసారీ రైతుల భూములే లాక్కుంటున్నారని,ఇది చాలా అన్యాయమన్నారు.