
రాజధాని రోడ్ల సొగసు చూడతరమా?
బనశంకరి: ఐటీ బీటీ, సిలికాన్ సిటీగా ఖ్యాతి ఘడించిన బెంగళూరులో రహదారులు అద్దం మెరిసిపోతాయేమో అనుకుంటారు. ఆ స్థాయిలో లేకున్నా ప్రయాణానికి చక్కగా ఉంటాయని ఆశిస్తారు. కానీ వాస్తవం వేరుగా ఉంటుంది. ఎటుచూసినా గుంతలు తేలిన రోడ్లను చూస్తే ఎవరికై నా బాధ కలుగుతుంది. ఇలాంటి రోడ్లపై ఎలా ప్రయాణించాలని మథనపడతారు. వర్షాలు ఎక్కువైన తరువాత రోడ్ల గుంతలు కూడా పెరిగి నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వేసవిలో మరమ్మతులను పట్టించుకోక సమస్య పతాకస్థాయికి చేరిందని విమర్శలున్నాయి. రాజధానిలో అన్ని ప్రాంతాల్లో గుంతల రోడ్లు వాహనదారులకు ప్రాణసంకటంగా మారాయి.
వానాకాలంలో సమస్య
రోడ్ల గుంతలు వర్షాకాలంలో మరింత సమస్యగా మారతాయి. గుంతల్లో నీరు నిలిచి ఎక్కడ గొయ్యి ఉందో కనిపించక వాహనదారులు ప్రయాణిస్తూ కింద పడి గాయపడడం జరుగుతోంది. సీఎం సిద్దరామయ్య , డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ 2024 సెప్టెంబరులో నగర పర్యటన చేసినప్పుడు గుంతల రోడ్లు అనేవి లేకుండా చూడాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. కొన్నిరోజులు హడావుడి చేసి తరువాత పట్టించుకోలేదు.
బెంగళూరు నగరంలోని అన్ని వలయాల్లో వేలాది గుంతలు ఉన్నాయని పాలికె ఇంజనీర్లు తెలిపారు. 2024 సెప్టెంబరులో 16 వేల గుంతలను పూడ్చామని చెప్పారు. నిత్యం రోడ్ల మీద గుంతలు ఏర్పడుతుంటాయని అప్పటి బీబీఎంపీ కమిషనర్, ప్రస్తుత పాలికె పాలనాధికారి తుషార్ గిరినాథ్ చెప్పారు. కానీ గత ఆరునెలలుగా సమస్యను పట్టించుకోవడం లేదు.
పూడ్చివేత చేపట్టాం: కమిషనర్
ప్రధాన రోడ్లు, మెయిన్ రోడ్లలో గోతుల్ని పూడుస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని బీబీఎంపీ కమిషనర్ మహేశ్వర్‌రావ్ తెలిపారు. టెండర్లు కూడా ఆహ్వానించామని, కొద్దిరోజుల్లో గుంతలను పూడ్చడం పూర్తిచేస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షం విరామం ఇచ్చిన సమయంలో పనులు చేపడతామన్నారు. హాట్ మిక్స్, కోల్డ్ మిక్స్‌ను సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించామన్నారు. అత్యవసర సమయంలో వెట్‌మిక్స్ వేసి పూడ్చుతున్నట్లు చెప్పారు. ప్రధాన రోడ్లలో 647 గుంతలు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారని, వీటితో పాటు రస్తగమన యాప్‌కు, పాలికె సహాయవాణికి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా గుంతలను 10 రోజుల్లో పూడ్చివేస్తామని చెప్పారు. గుంతలు ఏర్పడడం, పూడ్చడం నిరంతరం జరిగే పని అని రోడ్లు– సౌకర్యాల ఇంజినీర్ లోకేశ్ తెలిపారు.
గుంతల దారులతో ప్రజల సతమతం
వర్షాకాలంలో ప్రమాదాలకు పిలుపులు

రాజధాని రోడ్ల సొగసు చూడతరమా?

రాజధాని రోడ్ల సొగసు చూడతరమా?

రాజధాని రోడ్ల సొగసు చూడతరమా?