
తుంగభద్రకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రైతుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయానికి ముందస్తు వర్షాలు జీవం పోశాయి. జలాశయంలోకి కేవలం ఆరు రోజుల్లోనే 10 టీఎంసీలు పైగా పెరిగింది. వారం రోజులుగా జలాశయం వ్యాప్తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది, దీంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. 15 రోజులు క్రితం జలాశయంలో నీరు పూర్తిగా తగ్గి పోవడంతో జలచరాలకు సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం ఎగువున మంచి వర్షాలు కురుస్తున్నందున ఇన్‌ఫ్లో పెరిగింది. ఆదివారం 3 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 1589.60 అడుగులు, నిల్వ 10.703 టీఎంసీలు, ఔట్‌ఫ్లో 1995 క్యూసెక్కులుగా ఉందని టీబీ బోర్డు వర్గాలు తెలిపారు.