
ఆటంకాల నడుమ ఎస్సీ కులగణన
కోలారు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ రిజర్వేషన్లలో జనసంఖ్య ప్రాతిపదికన ఏబీసీడీలుగా వర్గీకరించేందుకు చేపట్టిన ఎస్సీ జనగణన ఆటంకాల మధ్య సాగుతోంది. కోలారు జిల్లాలో సాంకేతిక సమస్యలు వివిధ కారణాల వల్ల మందగతిలో ఉంది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. మే 5వ తేదీ నుంచి మొదటి దశ సమీక్ష ప్రారంభమైంది. జిల్లాలో 4 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎస్‌సి సముదాయం కుటుంబాలు సుమారు 1.32 లక్షలు ఉన్నాయి. సమీక్ష కోసం 1,538 బూత్‌లు గుర్తించారు. ఉపాధ్యాయ సిబ్బందిని నియమించి, రోజుకు 37 వేల కుటుంబాల సమీక్ష చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఒక్కో ఇంటి సర్వేకు 20 నిమిషాలు కేటాయించారు. పరిశీలకులకు ఇచ్చిన యాప్‌లో ఉన్న 42 ప్రశ్నలు ఉన్నాయి, కుటుంబీకుల నుంచి సమాచారం తీసుకుని యాప్‌లో నమోదుకు కనీసం ఒక గంట పడుతోందని ఎన్యుమరేటర్‌లు అంటున్నారు. ఈ ఆలస్యం వల్ల ముందుకు సాగడం లేదని వాపోయారు. అదీకాక యాప్ సమస్యలు, సర్వర్ డౌన్ ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో కొత్త యాప్ అందించినా అందుకు ఇంకా ఎన్యుమరేటర్లు అనుసరించడం లేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు 60 రోజుల్లో కులగణన పూర్తవుతుందా అనేది సందేహంగా మారింది.
పరిశీలకుల గైర్హాజరు
చాలామంది పరిశీలకులు సర్వేకు ముఖం చాటేస్తున్నారు. కొంతమంది సెలవులు పెట్టి వెళుతుంటే, మరికొంతమంది ఇంకా లాగిన్ కాలేదు. ప్రతి రోజు 6.30 గంటలకు సర్వేని ప్రారంభించాలి. అయితే రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలవుతోందని తెలిసింది. మొదటి దశ ఇంటింటి సమీక్ష ఈ నెల 17 వరకు జరుగుతుంది. మే 19 నుంచి 21 వరకు ఆయా గ్రామ పంచాయతీలలో విశేష శిబిరాలను నిర్వహిస్తున్నారు. కూలి కార్మికులు, వలస వెళ్లిన వారిని నమోదు చేస్తారు. 3వ దశలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
యాప్‌లో అనేక సమస్యలు
ఒక్కో కుటుంబం నమోదుకు
గంట సమయం
ఉసూరుమంటున్న పరిశీలకులు
సమస్యలు ఉన్నాయి: జేడీ
సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ స్పందిస్తూ మొదట ఇచ్చిన యాప్‌ను కాదని కొత్త యాప్‌ను అందించాం. దీనికి ఎన్యుమరేటర్‌లు అనుసరించడం ఆలస్యం అవుతోంది. 42 ప్రశ్నలను 20 నిమిషాలలో పూర్తి చేయాలని లక్ష్యం ఇచ్చాం. కొన్నిసార్లు ఇది సాధ్యం కావడం లేదు. ఎన్యుమరేటర్‌లకు మరింత శిక్షణ నివ్వాలని అనుకుంటున్నాం.

ఆటంకాల నడుమ ఎస్సీ కులగణన