
అధ్వానంగా భూగర్భ డ్రైనేజీలు
సాక్షి,బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. పేరుకే బళ్లారి స్టీల్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటారే కాని పాలకులు, అధికారులు ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఒక వైపు రోజు రోజుకు జనాభా పెరుగుతుంటే మరోవైపు రోజురోజుకు నగరంలోని సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుని భూగర్భ డ్రైనేజీ లీకేజీలు నిరంతరంగా కొనసాగుతుండటం నగర వాసులకు శాపంగా మారింది. భూగర్భ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో రోడ్ల మీద మురుగునీరు లీకయినప్పుడు వర్షం నీరులా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. అనంతపురం రోడ్డులోని బైపాస్ సర్కిల్‌కు వెళ్లే రోడ్డులో ఇటు వైపున మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున యూజీడీ మ్యాన్‌హోల్ నుంచి మురుగు నీరు లీకవుతూ రోడ్డు మీదకు పారుతోంది. అటు, ఇటు వాహనాలు వచ్చేటప్పుడు ఆ మురుగునీరు జనం మీదకు పడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు మరింత ఇబ్బందులు గురి అవుతున్నారు. రోడ్డు గుండా దుర్వాసన వెదజల్లుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు బయటకు ప్రవహిస్తోందని తెలిసినా మహానగర పాలికె అధికారులు, సిబ్బంది, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షపు నీరు కూడా తోడైంది..
ఇటీవల భారీ వర్షం కురవడంతో వర్షం నీటితో పాటు మురుగునీరు కలిసి ప్రవహించడం మరింత సమస్యగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నగరంలో ఏదో ఒక కాలనీ, రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి మురుగునీరు లీకవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. లీకేజీ అయిన చోట మహానగర పాలికె అధికారులు తూతూమంత్రంగా మరమ్మతు పనులు చేసి చేతులు దులుపుకోవడంతో సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. వందలాది కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి పనులకు మూలుగుతున్నా వాటిని సద్వినియోగం చేసుకుని నగరంలో పేరుకున్న సమస్యలను తీర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఇప్పటిది కాదు, గతంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, తర్వాత నగరంలో వేగవంతంగా అభివృద్ధి కావడంతో డ్రైనేజీ సిస్టంను సరి చేయాల్సిన అవసరం ఉందని పాలకులు, అధికారులు చెబుతున్నారే కాని ఆ దిశగా అడుగులు వేయక పోవడంతో స్టీల్ సిటీగా గొప్పలు చెబుతున్నారే కాని నగరంలో ఇంకా అధ్వానమైన రోడ్లు, డ్రైనేజీలు దర్శనం ఇస్తున్నాయి.
ఎక్కడబడితే అక్కడ లీకవుతున్న వైనం
దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీరు
పట్టించుకోని పాలికె యంత్రాంగం

అధ్వానంగా భూగర్భ డ్రైనేజీలు