
కారు, ట్రాక్టర్ ఢీ.. నలుగురు దుర్మరణం
సాక్షి,బళ్లారి: వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కారులో వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో పాటు అత్తా కోడళ్లు నలుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా చిత్రహళ్లి వద్ద జరిగింది. ప్రమాదంలో గంగమ్మ(50), కావ్య(30), హన్సిక(4), మనస్వి(2) అనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ప్రముఖ వ్యాపారి తిప్పేస్వామి కుటుంబ సభ్యులని తెలిసింది. ఆయన కుమారుడు యశ్వంత్‌తోపాటు కారులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే హొళల్కెరె పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలను సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యశ్వంత్‌ను చికిత్స నిమిత్తం చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు చిన్నారులు మృతి చెందడంతో చిత్రహళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై హొళల్కెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు

కారు, ట్రాక్టర్ ఢీ.. నలుగురు దుర్మరణం