
మహిళా ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం
బళ్లారి రూరల్ : మహిళా స్వయం సేవా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించనున్నట్లు దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున తెలిపారు. జెడ్పీ, గ్రామీణ జీవనోపాయ అభియాన్, వ్యవసాయ, ఉద్యానవన, కౌశల్యాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గ్లాస్‌హౌస్‌లో పీఎంఎఫ్‌ఎంఈ లబ్ధిదారుల సమాలోచన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటగా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముద్రా యోజనలోని ప్రయోజనాలను స్వయం సేవా సంఘాలు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 1,20,227 మంది స్వయం సేవా మహిళా సంఘం సభ్యులు ఉన్నారు. వీరు తయారు చేసిన బెడ్‌షీట్లు, దుప్పట్లు, శాలువాలు, విద్యార్థి వసతి నిలయాలు, సీజే జిల్లాసుపత్రి కొనుగోలు చేయాలని తెలిపారు. సంఘాల ఉత్పత్తులకు గ్లాస్‌హౌస్‌లో మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు తయారు చేసిన సాంబారు, చట్నీ పొడులు, ఊరగాయలు, అప్పడాలు తదితరాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ డాక్టర్ సురేశ్ బి.హిట్నాళ్ మాట్లాడుతూ పీఎంఎఫ్‌ఎంఎస్ యోజనలో 184 మంది లబ్ధిపొందారన్నారు. ఉద్యానవన శాఖ ఉపసంచాలకుడు రాఘవేంద్ర ప్రసాద్, జెడ్పీ యోజన డైరెక్టర్ కౌసర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.