
ఎస్సీ రిజర్వేషన్ సర్వే కాలావధి పొడిగింపు
శివాజీనగర: ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సర్వే కాలావధిని విస్తరించేందుకు తీర్మానించినట్లు ఏకపభ్య కమిషన్ అధ్యక్షుడు న్యాయమూర్తి హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ తెలిపారు. శుక్రవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ సర్వే సమయంలో ఉద్భవిస్తున్న కొన్ని సమస్యలను సరిచేసేందుకు సర్వే తేదీని విస్తరించాలని ఎమ్మెల్యేలు, పలు సంఘ సంస్థల నేతలు కోరారన్నారు. దీంతో ఈనెల 17వరకు చేపట్టాల్సిన ఇంటింటి సర్వేను ఈనెల 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రత్యేక శిబిరాలుఉ మే 26 నుంచి 28 వరకు పొడిగించినట్లు, ఆన్‌లైన్ ద్వారా వివరాల నమోదుకు మే 19 నుండి 28 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 73.72 శాతం ప్రగతి:
మే 15 నాటికి ఇంటింటి సర్వేలో 73.72 శాతం ప్రగతి సాధించినట్లు హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ తెలిపారు. బీబీఎంపీ పరిధిలోని పరిధిలో 55,027 ఎస్సీ కుటుంబాలతో సహా 31 జిల్లాల్లో మొత్తం 18,96,285 ఎస్సీ కుటుంబాలను సర్వే చేశామన్నారు. 1,10,32,556 ఎస్సీయేతర కుటుంబాలను భేటీ చేశామన్నారు. 2011 కుల గణన ప్రకారం రాష్ట్రంలో 21,40,304 ఎస్సీ కుటుంబాలు ఉండగా, 2025 నాటికి సుమారు 25,72,050 కుటుంబాలు ఉండవచ్చని అంచనా వేశామన్నారు. అపార్ట్‌మెంట్‌లలో సర్వేను అడ్డగించినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. అడ్డు చెప్పినవారి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ సిబ్బంది వర్గపు ఉప కులాలపై సమాచారం ఇవ్వని శాఖలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. బీబీఎంపీ పరిధిలో ప్రారంభదశలో సర్వే ప్రగతి కుంటు పడిందని, ఈ విషయమై బీబీఎంపీ చీఫ్ కమిషనర్, జోనల్ కమినర్‌లతో ఈనెల 17న సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఏకసభ్య కమిషన్ అధ్యక్షుడు
న్యాయమూర్తి హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్