
అకారణంగా రైలులో ప్రయాణికులపై దాడి
బళ్లారిఅర్బన్: వారంతా అమరావతి రైల్లో సాధారణంగా ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వినుకొండ రైల్వేస్టేషన్ వద్ద అక్కడి కొందరు యువకులు బళ్లారి, కంప్లి తదితర ప్రాంత నివాసులైన మహిళా ప్రయాణికులు యథేచ్చగా దాడి చేసి చెంపలు వాయించి నానా బీభత్సం సృష్టించి వచ్చిన దారినే పని ముగించుకొని హుటాహుటిన వెళ్లిపోయారు. కాగా ఆ రైలు ప్రయాణంలో బాధితులైన బళ్లారి శిరీష, వీరేష్, కంప్లి నాగలక్ష్మి తదితర 6 మందిపై స్థానిక మీడియాతో తమపై జరిగిన అమానుష దాడి గురించి ఆవేదనతో వివరించారు. తాము విజయవాడ నుంచి బళ్లారికి అమరావతి రైల్లో ప్రయాణిస్తున్నామన్నారు. ఈక్రమంలో వినుకొండ వద్ద రైలు ఆగినప్పుడు దుండగుల మాదిరిగా వచ్చిన యువకులు తమపై దాడి చేసినట్లు వాపోయారు.
సీటు కోసం గొడవే దాడికి కారణం
విజయవాడలో వినుకొండకు చెందిన ముగ్గురు మహిళలు సీటు కోసం గొడవ పెట్టుకొని వినుకొండకు రైలు చేరుకోగానే తమ వారికి ముందుగా ఇచ్చిన సమాచారం మేరకు రైలులోకి జొరబడి దాడి చేసి పరారయ్యారని శిరీష వాపోయారు. ఇలాంటి దాడులను ఎవరూ సహించరాదని తక్షణమే సీసీ కెమెరాల ద్వారా ఆ యువకుల గుంపును గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా తమకు న్యాయం చేయాలన్నారు. ఆ మార్గంలో అమరావతి ఎక్స్‌ప్రెస్ రైలు సదా మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండి ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమాయక మహిళలపై మళ్లీ దాడులు జరగకుండా ఆర్‌పీఎఫ్ పోలీసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శిరీష తదితర బాధితులు డిమాండ్ చేశారు.
వినుకొండ వద్ద అమరావతి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఘటన
పునరావృతం కాకుండా చర్యలు
చేపట్టాలని బాధితుల వినతి

అకారణంగా రైలులో ప్రయాణికులపై దాడి