
తోటలో నల్ల పునుగు
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా నాగసంద్ర గ్రామంలో అరుదైన నల్ల పునుగు పిల్లి కనిపించింది. బసవరాజు అనే రైతుకు చెందిన తోటలోకి వచ్చిన పునుగుపిల్లి ఓ చోట నక్కి ఉంది. అదృష్టం కొద్దీ అది కుక్కల కంట్లో పడలేదు. రైతు చూసి స్థానికులకు చెప్పడంతో అందరూ దానిని ఆసక్తిగా చూశారు. పట్టుకోవడానికి వెళ్తే అమాంతం కరవడానికి మీదకెగురుతోంది. ఇది నల్లరంగు పునుగుపిల్లి అని, ఇలాంటిది ఇక్కడ మొదటిసారి కనిపించిందని కొందరు తెలిపారు.
బైక్‌ను టెంపో ఢీ, ఇద్దరు మృతి
కృష్ణరాజపురం: ఆదివారం రాత్రి వేగంగా వచ్చిన టెంపో, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన హొసకోటె తాలూకాలోని చిక్క ఉళ్లూరు వద్ద జరిగింది. ఒడిశాకు చెందిన రుశికేశి (28), భక్తబందు (22) మృతులు. ముగ్గురూ బెంగళూరుకు వచ్చి కూలి పనులతో జీవించేవారని తెలిసింది. బైక్‌లో వస్తుండగా టెంపో ఢీకొట్టింది. బైకు మొత్తం నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హోసకోటె ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లి తనయుడు హత్య
యశవంతపుర: ఆస్తి వివాదంలో తల్లీ కొడుకును దారుణంగా హత్య చేసిన ఘటన బాగలకోట జిల్లా ఇల్‌కల్ తాలూకా నందవాడగి గ్రామంలో జరిగింది. సంగమ్మ గోనాళ (45), పుత్రుడు సోమప్ప (26)ను కొడవలితో నరికి హత్య చేశారు. ఆస్తికి సంబంధించి అదే గ్రామానికి చెందిన సణ్ణ సోమప్పతో గొడవలు ఉన్నాయి. సోమప్ప కక్షగట్టి హత్యలు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
ఇంకా మాసిపోని కుల జాఢ్యం
● ఆలయంలో పూజ చేయరాదని గొడవ
తుమకూరు: దళిత యువకుడు దేవాలయంలో పూజ చేయడానికి వెళ్లగా కొందరు అడ్డుకుని దూషించారు. ఈ ఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డేరి వద్ద కవణగాల గ్రామంలోని శ్రీరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. స్వామినాథ అనే దళిత యువకుడు సోమవారం ఆలయంలోకి వెళ్లాడు, అక్కడ ఉన్న కొంత మంది యువకులు స్వామినాథ్‌ను అడ్డుకుని బయటకి తీసుకెల్లి, ఇకపై గుడిలోకి రావద్దని బెదిరించారు. ఈ గొడవను కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. ఊరిలో గొడవలు జరకుండా పోలీసులు, తహసీల్దార్ చేరుకుని శాంతి సమావేశం జరిపి, గుడిలో దళితులు పూజలు చేయవచ్చని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని, ఎలాంటి భేదభావాలు వద్దని, ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగరాదని చెప్పారు. తహసిల్దార్ శిరిన్ రాజ్, అదనపు ఎస్పీ గోపాల్, డీఎస్పీ మంజునాథ్, అధికారులు పాల్గొన్నారు.
రౌడీలూ.. నేరాలు చేయొద్దు
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పోలీస్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్‌తో పోలీసులు పరేడ్‌ను నిర్వహించారు. దొడ్డ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ–2 నాగరాజు ఆధ్వర్యంలో సాగింది. చుట్టుపక్కల ఊర్ల నుంచి మొత్తం 248 రౌడీషీటర్‌లు ఉండగా 118 మంది హాజరయ్యారు. కొందరు అనారోగ్యం వల్ల, మరి కొందరు జైల్లో ఉండడం వల్ల రాలేదు. ఇటీవల రాష్ట్రంలో నేరాలు పెరుగుతండడం వల్ల పోలీసులు రౌడీల మీద దృష్టి సారించారు. ఏఎస్పీ నాగరాజు మాట్లాడుతూ నేరాలకు పాల్పడితే తోకలు కత్తిరిస్తామని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే జైల్లో పెడతామని హెచ్చరించారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లను తొలగిస్తామని చెప్పారు. డీవైఎస్పీ రవి, పోలీసులు పాల్గొన్నారు.

తోటలో నల్ల పునుగు

తోటలో నల్ల పునుగు

తోటలో నల్ల పునుగు