
అస్తవ్యస్తంగా రాజ కాలువలు
సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రాజకాలువలు పూడికతో నిండిపోయాయి. మురుగు ముందుకు కదలడం లేదు. ఫలితంగా నగరంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. నగర వ్యాప్తంగా 50కి పైగా రాజాకాలువలు ఉన్నాయి. ఏ ఒక్క కాలువలో కూడా పూడిక తొలగించడం లేదు. రాజాకాలువలు చుట్టుపక్కన కాలనీల వాసులు దుర్వాసన పీల్చుకుంటూ రోగాలు బారిన పడుతున్నారు. నిల్వ మురుగు నీటిలో దోమలు వృద్ధి చెంది ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి.
ఉదాసీనంగా కార్పొరేటర్లు, అధికారులు
విశాల్‌నగర్, రూపనగుడి, గణేష్‌కాలనీ, దొణప్ప స్ట్రీట్, కణేకల్లు బస్టాండ్ రోడ్డు తదితర కాలనీల్లో ఉన్న రాజాకాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. కాలువలు శుభ్రం చేయించడంలో అధికారులు, కార్పొరేటర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో సహజీవనం చేయాల్సి వస్తోంది.
చిన్నమార్కెట్‌లో అభివృద్ధి నిల్
రెండు సంవత్సరాలు క్రితం నగరంలోని చిన్న మార్కెట్ అభివృద్ధి చేసేందుకు ఉన్న పాత కట్టడాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో చిన్న మార్కెట్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. చిన్న మార్కెట్ తొలగించడంతో పక్కనే కూరగాయాలు, ఆకుకూరలు అమ్ముకుని పలువురు చిరు వ్యాపారులు జీవనం సాగిస్తుండగా, పడగొట్టిన ఖాళీ స్థలాన్ని కారు పార్కింగ్‌లు, చెత్తా చెదారం వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఏళ్లతరబడి అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంతో కూరగాయాలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మోకారోడ్డులో దుమ్ముధూళి
మోకా రోడ్డు అభివృద్ధి పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో వాహనాల సంచారం ధాటికి దుమ్మ ధూళి గాలిలో కలిసి పాదచారులు, వాహనదారుల కళ్లలో పడుతోంది. నిధుల కొరత లేదని ఓ వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుండగా మరో వైపు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం విచిత్రంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. మైనింగ్ ఫండ్, కేఎంఆర్‌సీ నిధులు తదితర నిధులు వేల కోట్లు మూలుగుతున్నాయి. వాటిని సద్వినియోగం చేస్తూ అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే స్పృహ అధికారులు, పాలకుల్లో కనిపించడం లేదనే విమర్శలున్నాయి.
వీధి దీపాలు లేవు
కాలనీల్లో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రిళ్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్లలోనే చీకట్లు కమ్ముకుంటున్నాయి. ప్రజలు అంధకారంలో సంచరించాల్సి వస్తోంది. ఇప్పటికై నా నగరాభివృద్ధిపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బళ్లారిలో అధ్వానంగా పారిశుధ్యం
ముందుకు కదలని మురుగు
దుర్వాసనతో ప్రజల సహవాసం
చిన్న మార్కెట్ అభివృద్ధి ఏదీ?
రోడ్లపైనే చిన్న మార్కెట్‌లో
కూరగాయాలు అమ్మకాలు

అస్తవ్యస్తంగా రాజ కాలువలు

అస్తవ్యస్తంగా రాజ కాలువలు