
యువత రక్తదానం చేయాలి
రాయచూరు రూరల్: రక్తదానం చేయడానికి యువత ముందుండాలని సమాజ సేవకులు బన్ని, మారుతి పిలుపునిచ్చారు. శనివారం దేవర కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్న తోటివారి ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా మనోభావంతో పని చేయాలన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోడానికి సేకరించిన రక్తాన్ని రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాల రక్త భండాగారానికి అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో సంతోష్, జోసెఫ్, సంజీవ్, శ్రీధర్, శ్యామ్యూల్, హాజీలున్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
హొసపేటె: హొసపేటెలోని సంక్లాపూర్‌లో 110/11 కేవీ విద్యుత్ పంపిణీ కేంద్రంలో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్న కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎఫ్–6 సంక్లాపూర్, జంబునాథగుడి మార్గాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. తాలూకాలోని కారిగనూరు, సంక్లాపూర్, మారుతీ నగర్, జంబునాథ్ రోడ్డు, జంబునాథ గుడి ప్రాంతాల్లోని విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి జెస్కాంతో సహకరించాలని హొసపేటె సిటీ సబ్ డివిజన్–2 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.హేమారెడ్డి తెలిపారు.
హంపీకి పర్యాటకుల తాకిడి
హొసపేటె: ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీ శనివారం పర్యాటకుల సందడితో కిటకిటలాడింది. వీకెండ్ సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు హంపీలో ఉన్న విరుపాక్షేశ్వర స్వామి ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రాయల కాలంనాటి విజయ విఠల దేవస్థానంలో ఉన్న సప్తస్వర స్తంభాలు, ఏక శిలారథం, సమీపంలోని మహానవమి దిబ్బ, హజారరామ దేవస్థానం, లోటస్ మహల్, ఉగ్రనరసింహ స్వామి దేవస్థానం, కృష్ణ దేవస్థానం, రాణి స్నాన మందిరం తదితర సుందర స్మారకాలు, కట్టడాలు, ఆలయాలను తనివి తీరా వీక్షించి ఆనందించారు.
మట్టి, నీటి సంరక్షణ అవసరం
బళ్లారిఅర్బన్: గని బాధిత ప్రాంతాల్లో మట్టి, నీటి సంరక్షణ చాలా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మంజునాథ్ తెలిపారు. గనుల ప్రభావంతో బాధితుల సమగ్ర పర్యావరణ పథకం ద్వారా బళ్లారి తాలూకా హలకుంది గ్రామ పంచాయతీ పరిధిలోని హొన్నళ్లితాండాలో ఏర్పాటు చేసిన సహభాగత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇలాంటి ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లో ఏ విధంగా మట్టిని, నీటిని సంరక్షణ చేయాలి, సంరక్షణ చేయడానికి ఎలాంటి ప్రక్రియ చేపట్టాలో ఆయన సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు తొలిదశలో ఎంపికయ్యాయన్నారు. వీటిలో బళ్లారి జిల్లా కూడా ఒకటన్నారు. ఈ పథకం 5 ఏళ్ల వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ పథకం కింద పని చేసే సిబ్బంది రైతుల ఇళ్లకే వెళ్లి వారితో మాట్లాడి అవసరమైన దస్తావేజులను తీసుకునేలా సమీక్ష చేపట్టామన్నారు. ఈ విషయంలో రైతులందరూ సరైన వివరాలను అందించి సహకరించాలన్నారు. ఏడీ దయానంద్‌తో పాటు గ్రామ్స్ సంస్థ సీఈఓ మహేష్‌కుమార్, తేరి సంస్థ విజయ మేటి, అశ్విని, నిర్మల బాయి, రమేష్‌నాయక్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి నివారిస్తాం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కల్లూరులో తాగునీటికి ఇబ్బందులు రానివ్వబోమని జిల్లా పంచాయతి అభివృద్ధి అధికారి ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం కల్లూరులోని చెరువును ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడిచినందున జిల్లాధికారి ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు మధ్య తాగునీటిని చెరువులోకి నింపుతామన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి నివారణకు తోడు మరమ్మతు పనులను జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో చేపడతామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సంగప్పగౌడ, సభ్యులు శివకుమార్, వెంకటేష్, అధికారులు శరణప్ప, రవి, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

యువత రక్తదానం చేయాలి

యువత రక్తదానం చేయాలి

యువత రక్తదానం చేయాలి