
గందరగోళంగా బీ–ఖాతా అభియాన్
సాక్షి,బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన బీ–ఖాతా అభియాన్ గందరగోళంగా మారింది. మూడు నెలల క్రితం ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ఆర్‌ఎస్, ఎన్‌ఏ ఇంటి స్థలాలను సక్రమం చేస్తూ వాటికి పన్నులు విధిగా చెల్లించి, అన్ని విధాలుగా రికార్డులు సరిగా ఉంటే బీ–ఖాతా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదిగా నిలిచిపోయిన ఆర్‌ఎస్, ఎన్‌ఏ, టీఎస్‌లకు సంబంధించిన ఇంటి స్థలాలను బీ–ఖాతా చేయించుకుని వాటిని సక్రమం చేసుకోవడంతోపాటు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలవుతుందని ఆయా ఇంటి స్థలాల యజమానులు బీ–ఖాతా చేయించుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇంటి స్థలాలకు సంబంధించి వేలాది రూపాయల పన్నులు కూడా కట్టి ప్రభుత్వ ఖజానాకు ఇతోధికంగా తోడ్పాటునందించారు. అయితే ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే రీతిగా ఉన్న సిబ్బందితోనే బీ–ఖాతా అభియాన్‌ను పూర్తి చేయాలనే విధంగా నిబఽంధనలు, ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
బీ–ఖాతా కోసం ఎగబడిన జనం
నగరంలో దాదాపు 40 వేల ఇళ్ల స్థలాలకు సంబంధించి బీ–ఖాతా చేయించుకునేందుకు వీలు ఉంటుంటంతో ఆయా ఇళ్ల స్థలాల యజమానులు నగరంలోని గాంధీనగర్, కౌల్‌బజార్ ఫస్ట్‌గేటు, కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల వద్ద బీ–ఖాతా చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. అయితే సందట్లో సడేమియా అన్న విధంగా కొందరు అధికారులు బీ–ఖాతా చేసేందుకు డబ్బులు ఇస్తే తొందరగా చేస్తారనే ఆరోపణలు రావడంతో, బీ–ఖాతా చేయడం ఆలస్యం చేస్తున్నారని లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. దీంతో బుధవారం బీ–ఖాతా అభియాన్ కేంద్రాలను లోకాయుక్త ఎస్పీ సిద్దరాజు ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది తనిఖీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకాయుక్త ఎస్పీతో పాటు సిబ్బంది బీ–ఖాతా కేంద్రాల వద్ద ప్రజల విన్నపాలను ఆలకించారు. మూడు నెలలైనా తమకు బీ–ఖాతా సర్టిఫికెట్ ఇవ్వలేదని, తాము అన్ని విధాలుగా రికార్డులతో పాటు దరఖాస్తు చేశామని ఫిర్యాదు చేశారు.
ఎవరూ ఆందోళన పడవద్దు
దీంతో బాధితుల పేర్లను లోకాయుక్త సిబ్బంది అంజినప్ప వారి వారి పేర్లతో పాటు దరఖాస్తులో పొందుపరిచిన రికార్డులు రాసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా రికార్డులు సక్రమంగా ఉంటే ఇంటికే వచ్చి బీ–ఖాతాను అందజేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లోకాయుక్త అధికారులు బాధితులకు భరోసా ఇచ్చారు. నగరంలోని మూడు కేంద్రాల్లో బీ–ఖాతా అభియాన్ చేసుకునేందుకు, ఈనెల 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించిందని ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే కచ్చితంగా ప్రభుత్వం గడువు పెంచే అవకాశాలు ఉన్నాయన్నారు. నగరంలోని ప్రతి ఒక్క ఆర్‌ఎస్, ఎన్‌ఏ ఇంటి స్థలాలకు సంబంధించిన వాటికి బీ–ఖాతా అందజేస్తారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీ–ఖాతా అభియాన్ కేంద్రాల వద్ద ఓ వైపు అధికారులు తనిఖీ చేస్తుండగా, మరో వైపు జనం బీ–ఖాతా చేయించుకునేందుకు అక్కడే మకాం వేశారు.
నెలల తరబడి సర్టిఫికెట్
ఇవ్వకపోవడంపై జనం ఆగ్రహం
లోకాయుక్త ఎస్పీ ఆధ్వర్యంలో అభియాన్ కేంద్రాల్లో తనిఖీ

గందరగోళంగా బీ–ఖాతా అభియాన్