సాక్షి,బళ్లారి: కేఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు మరాఠ దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ కన్నడ పర సంఘాలు కర్ణాటక బంద్‌కు పిలుపునివ్వడంతో బంద్ పాక్షికంగా జరిగింది. శనివారం కర్ణాటక బంద్‌కు కన్నడ పర సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బళ్లారి జిల్లాలో బంద్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ బస్సులు, ఆటోలు యథావిధిగా నడిచాయి. అయితే కర్ణాటక రక్షణ వేదిక(శివరామగౌడ వర్గం) బళ్లారి, విజయనగర జిల్లాల అధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో బంద్‌కు మద్దతు ప్రకటించారు. రాయల్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ జిల్లాధికారి కార్యాలయం వరకు చేరుకుని ఆందోళన చేపట్టి మాట్లాడారు. కన్నడిగులపై మరాఠీయులు చేస్తున్న దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఉ–కలో ప్రభావం అంతంత మాత్రమే
ఉత్తర కర్ణాటక పరిధిలో ధార్వాడ, హావేరి, బాగల్‌కోటె, గదగ్, కొప్పళ, బీదర్ తదితర జిల్లాల్లో కూడా బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. యథావిధిగా బస్సుల రాకపోకలు జరగడంతో పాటు కన్నడ పర సంఘాల కార్యకర్తలు అక్కడక్కడ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బెళగావి నుంచి మహారాష్ట్రకు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. బెళగావిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.బంద్‌తో వ్యాపారాలు లేక బెళగావి బోసిపోయింది. చిన్న చిన్న వ్యాపారులు, ముఖ్యంగా పూలు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. బళ్లారి జిల్లాతో పాటు చిత్రదుర్గ, దావణగెరె తదితర జిల్లాల నుంచి బెళగావికి వెళ్లాల్సిన కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను నిలిపివేశారు. మొత్తం మీద బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోగా బంద్ ప్రభావం అంతగా లేకపోగా కేవలం బెళగావిలో మాత్రమే బంద్ ప్రభావం కనిపించింది.
రాయచూరులో పాక్షిక బంద్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో పాక్షికంగా, ప్రశాంతంగా జరిగిన బంద్‌కు అందరి మద్దతు లభించింది. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద జరిగిన సమావేశంలో కరవే అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడారు. కేఎస్‌ఆర్టీసీ బస్ కండక్టర్‌పై మరాఠీయులు దాడులు చేయడాన్ని ఖండిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. తీన్ కందిల్, షరాఫ్ బజార్, కూరగాయల మార్కెట్, దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథాప్రకారం పని చేశాయి. రవాణ సౌకర్యాలు కొంత మేర స్తంభించాయి. కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలు నగరంలో కలియ తిరుగుతూ బంద్ చేయించారు. మహారాష్ట్ర సర్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
విజయనగరలోనూ బంద్ పాక్షికమే
హొసపేటె: బెళగావిలో ఎంఈఎస్ దమనకాండకు నిరసనగా శనివారం చేపట్టిన కర్ణాటక బంద్‌కు విజయనగరలో అంతగా మద్దతు లభించలేదు. వాటాల్ నాగరాజ్, సారా గోవిందు సహా వివిధ సంఘ సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపునకు విజయనగర జిల్లాలో ఏ సంస్థ కూడా మద్దతు ప్రకటించలేదు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు, ఆటోలు, కిరాణ సామగ్రితో సహా ప్రజాజీవితం యథావిధిగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు కూడా యథావిధిగా పని చేశాయి. విజయనగర జిల్లాలోని హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హూవినహడగలి, కూడ్లిగి, కొట్టూరు, హరపనహళ్లిలలో బంద్‌కు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బంద్ లేదా నిరసనకు పిలుపునివ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు మాత్రమే తీసుకున్నారు.
హుబ్లీలో ఆందోళనకారుల బంద్
హుబ్లీ: బెళగావిలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్) నేతల తీరుపై వివిధ కన్నడ సంఘాల కార్యకర్తలు, ప్రముఖులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌లో భాగంగా చెన్నమ్మ సర్కిల్‌తో పాటు ధార్వాడలోని కోర్టు సర్కిల్, జూబ్లి సర్కిల్ తదితర కూడళ్లలో వివిధ సంఘాల కార్యకర్తలు ఎన్‌ఈఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనకారులు మాట్లాడుతూ బెళగావిలో మరాఠీలో మాట్లాడలేదని కండక్టర్‌పై దాడి చేసిన పర్యవసానంగా తలెత్తిన పరిణామాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఎస్ నేతలు తరచు ఇలాంటి పోకిరీ పనులకు పాల్పడుతుంటారని ధ్వజమెత్తారు.
బళ్లారిలో కర్ణాటక రక్షణ వేదిక మద్దతు
యథావిధిగా బస్సులు, ఆటోల సంచారం
బెళగావి నుంచి మహారాష్ట్రకు బస్సుల రాకపోకల నిలిపివేత
వివిధ జిల్లాల నుంచి బెళగావికి బస్సుల రాకపోకలు లేవాయె.!
కర్ణాటక బంద్ ప్రభావం పాక్షికం
కర్ణాటక బంద్ ప్రభావం పాక్షికం