6 నెలల పాటు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్
బనశంకరి: హనీట్రాప్‌పై శాసనసభ దద్దరిల్లింది. శుక్రవారం శాసనసభ ప్రారంభం కాగానే హానీట్రాప్ అంశంపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పేపర్ ముక్కలు విసిరి గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. రాష్ట్ర సహకార శాఖమంత్రి కేఎన్.రాజణ్ణ హనీట్రాప్ కేసును న్యాయ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సభలో ధర్నాకు దిగారు. విపక్షాలైన బీజేపీ, జేడీఎస్ సభ్యుల ధర్నా మధ్య ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిల్లు ప్రతులను విసురుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకోగానే మార్షల్స్ లోపలికి వచ్చి విపక్ష సభ్యులను స్పీకర్ పోడియం నుంచి తప్పించి స్పీకర్‌కు రక్షణగా నిలిచారు.
ద్రవ్యబిల్లు పేపర్ల విసిరివేత
అంతటితో మిన్నకుండని ప్రతిపక్ష సభ్యులు ద్రవ్యబిల్లు పేపర్లను స్పీకర్ యూటీ.ఖాదర్, సీఎం సిద్దరామయ్యల మీదకు విసిరారు. విపక్ష సభ్యుల తీరుతో కోపోద్రిక్తులైన కాంగ్రెస్ సభ్యులు ముందుకు చేరుకుని ముఖ్యమంత్రి చుట్టూ రక్షణగా నిలబడి విపక్షాలతో వాగ్వివాదానికి దిగారు. ఓ దశలో పరిస్దితి అదుపు తప్పి పరస్పరం చేయి చేసుకునే దాకా వచ్చింది. మార్షల్స్ అధికార, విపక్ష సభ్యులకు గోడగా నిలిచారు. గందరగోళం మధ్య ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు వేతనభత్యం పెంచే బిల్లు, బడ్జెట్ ఆమోదం ద్రవ్యవినిమయ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా సభ కొద్దిసేపు అదుపులోకి వచ్చింది. స్పీకర్ సభ నుంచి వెళ్లగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య విపక్ష నేతలు, సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లారు.
న్యాయ విచారణ చేపట్టాలని విపక్షాల ధర్నా
అంతకు ముందు సభ ప్రారంభం కాగానే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాసే విద్యార్దులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించగా బీజేపీ సభ్యుడు సునీల్‌కుమార్ సభలో లేచి నిలబడి మంత్రి కేఎన్.రాజణ్ణ గురువారం హనీట్రాప్ గురించి సభలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిదులతో పాటు జడ్జీలు హానీట్రాప్‌కు గురయ్యారని ఇది, తీవ్రమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం హనీట్రాప్‌పై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హనీట్రాప్‌కు కులం, పార్టీ ఏదీ లేదన్నారు. అధికారదాహం దీని వెనుక ఉందని మంత్రి రాజణ్ణ బయట మాట్లాడాల్సింది. కానీ సభలో కన్నీరుపెడుతూ భయంతో ఉన్నారని కేంద్ర నేతలు కూడా ఇందులో ఉన్నారని తెలిపారన్నారు. ఈనేపథ్యంలో హనీట్రాప్‌పై న్యాయవిచారణ చేపట్టాలన్నారు. విపక్షనేత ఆర్.అశోక్ సైతం సునీల్‌కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపి మంత్రులు అభద్రతాభావంలో ఉన్నారన్నారు. పలువురు హనీట్రాప్ పెద్ద దందాగా మారిందన్నారు.
అశోక్ వ్యాఖ్యలపై మంత్రి దినేష్ అభ్యంతరం
ముఖ్యమంత్రి పదవి కోసం అన్నింటిని ధ్వంసం చేస్తున్నారంటే అర్థం ఏమిటని అనడంతో మంత్రి దినేశ్ గుండూరావ్ అశోక్ మాటలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశోక్ ఊహాజనితంగా మాట్లాడుతున్నారని, సీఎం పదవి, హనీట్రాప్‌కు పాల్పడుతున్నారని అనడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలు కొనసాగించిన ఆర్.అశోక్ హనీట్రాప్ తీవ్రమైన విషయం, దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మాట్లాడిన సునీల్‌కుమార్ సభలో మంత్రి ఒకరు హానీట్రాప్ జరిగిందని చెప్పారని, మీ ఇంటెలిజెన్స్ శాఖ ఏమి చేస్తోందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జోక్యం చేసుకున్న మంత్రి ప్రియాంక్ ఖర్గే సునీల్ కుమార్ వ్యాఖ్యలను ఒప్పుకుంటున్నానని, కానీ మీకు నైతికత ఉండాలని అన్నారు. అధికారం, డబ్బు ఇతర కారణాల కోసం హనీట్రాప్ చేయవచ్చు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.
ఉన్నత స్థాయిలో విచారణ
ఈ సమయంలో సిద్దరామయ్య మాట్లాడుతూ గురువారం సభలో నేను లేనన్నారు. హనీట్రాప్ గురించి రాజణ్ణ తెలిపారన్నారు. దీనిపై సభలో హోంమంత్రి సమాధానమిచ్చారని, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. ఎవరినీ కాపాడే ప్రశ్నే లేదన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నప్పటికీ వారికి శిక్ష తప్పదన్నారు. రాజణ్ణ ఎస్సీ సముదాయానికి చెందిన వ్యక్తి, అతను ఎవరి పేరూ చెప్పలేదు. హనీట్రాప్ జరిగిందని చెప్పారు, ఎవరు మాట్లాడినా ఇది తప్పు, సభలో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అందరికీ రక్షణ కల్పించే బాధ్యత తమదన్నారు. సీఎం వ్యాఖ్యలపై సమాధాన పడని ప్రతిపక్షాలు ఉన్నత స్దాయి విచారణ అంటే ఏమిటి మీరే ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఇద్దరు మంత్రులు హనీట్రాప్ గురించి మాట్లాడారని, కేంద్రమంత్రి, న్యాయమూర్తి ఉన్నారని తెలిపారన్నారు. మన పోలీసులు న్యాయమూర్తిని విచారణ చేపట్టడం సాధ్యమా? న్యాయ విచారణ చేపట్టాలని ఆర్.అశోక్ డిమాండ్ చేశారు.
విపక్ష సభ్యులు పేపర్లు విసురుతుండగా స్పీకర్‌కు భద్రతగా మార్షల్స్
విపక్ష సభ్యులను బయటకు పంపుతున్న మార్షల్స్
న్యాయ విచారణకు విపక్షాల డిమాండ్
స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాలు
సభలో గందరగోళం సృష్టించిన వైనం
హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ గురువారం రాజణ్ణ ఈ విషయం ప్రస్తావించారని అతను కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేసిన అనంతరం ఉన్నత స్థాయి విచారణ చేస్తామని, అయితే ఏ స్థాయి విచారణ అనేది త్వలో నిర్ణయిస్తామన్నారు. దీనికి సమ్మతించని విపక్షాలు న్యాయవిచారణ చేపట్టాలని పట్టుబడుతూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఎవరు ఎవరప్పా సీడీ యజమాని, ఎవరు సీడీ ఫ్యాక్టరీ ఓనర్, ఎవరు కాంగ్రెస్ పార్టీ హనీట్రాప్ పార్టీ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం హనీట్రాప్, శాంకీ చెరువులో కావేరి హారతి, కాంగ్రెస్ బ్లాక్‌మెయిల్ అంటూ సభలో నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. ప్రతిపక్షాల ధర్నాతో కోపోద్రిక్తుడైన సిద్దరామయ్య మీకు బడ్జెట్‌పై సమాధానం అవసరం లేదని, దీంతో ఈ విధంగా చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో మీ ప్రవర్తన సరికాదంటూ బడ్జెట్‌పై సమాధానం ఇస్తుండగా ప్రతిపక్షాలు ధర్నా కొనసాగిస్తూ నినాదాలు చేశారు.
బనశంకరి: హనీట్రాప్‌పై శుక్రవారం శాసనసభ దద్దరిల్లడంతో బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ యూటీ.ఖాదర్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు కాషాయ శాలువాలు ధరించి హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు యథావిధిగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. తమ స్థానాల్లోకి వెళ్లి ఆసీనులై సభా కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం కల్పించాలని స్పీకర్ సభ్యులకు మనవి చేశారు. అయినా వినకపోవడంతో 18 మందిని సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు దొడ్డనగౌడ హెచ్.పాటిల్, డాక్టర్ సీఎన్.అశ్వత్‌నారాయణ్, ఎస్‌ఆర్.విశ్వనాథ్, బసవరాజ్ ఎంఆర్.పాటిల్, చెన్నబసప్ప, బీ.సురేశ్‌గౌడ, ఉమానాథ్ కోట్యాన్, శరణు సలగార్. డాక్టర్ శైలేంద్ర బెల్దాళె, సీకే.రామమూర్తి, యశ్‌పాల్ సువర్ణ, బీపీ.హరీశ్, డాక్టర్ భరత్‌శెట్టి, మునిరత్న, బసవరాజ్ ముత్తిమోడ్, ధీరజ్ మునిరాజు, డాక్టర్ చంద్రు లమాణి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
ఫిర్యాదు అనంతరం విచారణ
ఫిర్యాదు అనంతరం విచారణ
ఫిర్యాదు అనంతరం విచారణ
ఫిర్యాదు అనంతరం విచారణ