గెస్ట్‌ లెక్చరర్ల ధర్నా

- - Sakshi

గౌరిబిదనూరు: మా డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23 నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తాలూకాలోని అతిథి ఉపన్యాసకులు వాపోయారు. మంగళవారం ప్రభుత్వ ఫస్ట్‌ గ్రేడ్‌ కళాశాల ముందు నిరసన నిర్వహించారు. ఏళ్ళ తరబడి ఉద్యోగాలు చేస్తున్నాం, మా సర్వీసులను పర్మినెంట్‌ చేయాలని కోరుతున్నాం. సరైన వేతనాలు, భత్యాలు లేక దీనావస్థలో బతుకీడుస్తున్నామని వాపోయారు. 6 రోజులుగా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు.

డీకేశి సీబీఐ కేసు..

హైకోర్టుకు యత్నాల్‌

శివాజీనగర: ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ఉసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు తుది దశలో ఉన్న తరుణంలో కేబినెట్‌ సీబీఐ విచారణను ఉసంహరించుకోవడం చట్ట విరుద్దమని, తమ అప్పీలును తీవ్రంగా పరిగణించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

షాపింగ్‌ కాంప్లెక్స్‌లో

మంటలు

దొడ్డబళ్లాపురం: ఐటీ సిటీలో ఎయిర్‌పోర్టు రోడ్డులో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. చిక్కజాల పోలీస్ట్‌షన్‌ ఎదురుగా హైవే పక్కన ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. మంటల కారణంగా చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుని స్థానికులు ఇబ్బంది పడ్డారు. మంటలకు కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో ఉన్న విలువైన వస్తువులు, ఫర్నిచర్లు కాలిబూడిదయ్యాయి. ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసారు. కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగినట్టు తెలిసింది.

నటి లీలావతికి

శివన్న పరామర్శ

దొడ్డబళ్లాపురం: సీనియర్‌ నటి లీలావతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో హీరో శివరాజ్‌కుమార్‌ మంగళవారంనాడు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలోని ఫార్మ్‌హౌస్‌కు వచ్చిన శివరాజ్‌కుమార్‌ లీలావతి కుమారుడు వినోద్‌రాజ్‌ను కౌగిలించుకుని ఓదార్చారు. తల్లి ఆరోగ్యం గురించి వినోద్‌రాజ్‌ శివణ్ణకు వివరించారు. శివణ్ణతో పాటు భార్య గీత కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం హీరో దర్శన్‌, సీనియర్‌ హీరో అర్జున్‌ కూడా విచ్చేసి లీలావతి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

ఇంజెక్షన్లు వికటించి గర్భవిచ్ఛిత్తి

బనశంకరి: ఓవర్‌డోస్‌ ఇంజెక్షన్‌ వేయడంతో మహిళకు గర్భస్రావం అయిందని కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బెంగళూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గర్భిణి ప్రతి నెలా ఆస్పత్రికి చెకప్‌ కోసం వచ్చేది. అదేమాదిరి మంగళవారం రాగా, కడుపునొప్పిగా ఉందనడంతో ఆమెకు వైద్యులు ఇంజెక్షన్‌ వేశారు. కొంతసేపటికి సూది వేసిన చోట వాపు రావడంతో పాటు అస్వస్థతకు గురైంది. నొప్పి తగ్గాలని ఆమెకు పలు పెయిన్‌కిల్లర్‌ ఇంజెక్షన్లు వేశారు. కానీ ఆమెకు కడుపునొప్పి మరింత తీవ్రమైంది. చివరకు వైద్యులు అబార్షన్‌ చేయాలని చెప్పి చేసేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి వచ్చిందని మహిళ కన్నీరుపెట్టింది. ఆమె బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి సర్దిచెప్పారు.

కెప్టెన్‌ ప్రాంజల్‌కు నివాళి

మైసూరు: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన ఆర్మీ కెప్టెన్‌ ఎంవీ ప్రాంజల్‌కు సోమవారం రాత్రి నగరంలోని ఫీల్డ్‌మార్షల్‌ కరియప్ప సర్కిల్‌ల్లో సావర్కర్‌ యువకుల సంఘం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీర మరణం పొందిన సైనికుల ఫొటోలను ప్రదర్శిస్తూ క్యాండిల్స్‌ వెలిగించి నివాళి అర్పించారు. దివంగత ప్రాంజల్‌ సేవలను కొనియాడుతూ, యువత వీర సైనికుల ఆదర్శాలను అలవర్చుకుని ముందుకు సాగాలని అన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top